పరిస్థితి విషమం
నర్సాపూర్ రూరల్: మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన మన్నే రమేశ్, చెన్నం రెడ్డి గ్రామంలోని బెల్ట్ షాపు వద్దకు ఆదివారం మద్యం కోసం వెళ్లారు. తాగిన మత్తులో బెల్ట్ షాపు ఎదురుగా ఉన్న పాన్‌షాప్ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చెన్నం రెడ్డి , రమేశ్‌పై కత్తితో పలుచోట్ల దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. రమేశ్ భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న చెన్నం రెడ్డిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


