మెదక్ ఎంపీ రఘునందన్‌తోనూ ఎమ్మెల్యే భేటీ
జహీరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబైకు మంజూరైన బుల్లెట్ రైలును జహీరాబాద్ మీదుగా నడిపేలా డీపీఆర్‌ను రూపొందించేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను అఖిలపక్షం నాయకులు కోరారు. ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డిల ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు మంత్రి దామోదర రాజనర్సింహను ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మొదటి విడత డీపీఆర్ అలైన్‌మెంట్‌లో బుల్లెట్ రైలు మార్గాన్ని జహీరాబాద్ మీదుగా ఖరారు చేసినప్పటికీ ఇటీవల ఆమోదం పొందిన తుది డీపీఆర్‌లో ఆ మార్గాన్ని కోకాపేట్, శంషాబాద్, వికారాబాద్‌ల మీదుగా మార్చడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారనుందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఇదిలాఉంటే మెదక్ ఎంపీ రఘునందన్‌రావుతో సైతం భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు రఘునందన్‌రావు స్పందిస్తూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్, బీజేపీ నాయకులు పాండురంగారెడ్డి, సుభాష్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.


