
విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఇవ్వాలి
సిద్దిపేటఅర్బన్: ప్రభుత్వం నిర్దేశించిన విధంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు కామన్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ కె.హైమావతి సూచించారు. బుధవారం సాయంత్రం అర్బన్ మండలం మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి డైలీ స్టాక్ రిజిష్టర్‌ను తనిఖీ చేసి రోజువారీగా తీసుకునే సామగ్రిని తూకం వేసి పరిశీలించారు. విద్యార్థులు భోజనం చేసే సమయంలో వంట సిబ్బంది తప్ప వార్డెన్ కానీ ఇతర సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కామన్ మెనూ ప్రకారం బ్రేక్‌ఫాస్ట్‌లో పులిహోర, మధ్యాహ్నం చికెన్ కర్రీ, సాయంత్రం టీ, టమాటా పప్పు, పప్పుచారు చేసినట్టు వంట సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టమాటా పప్పు రుచి మెరుగుపరచాలని, ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఒక్కో విద్యార్థికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తోందన్నారు. ప్రిన్సిపాల్ నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్టడీ అవర్ కొనసాగుతుండటంతో ప్రతి తరగతి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి శ్రద్ధగా చదువుకోవాలని, ఆటలు బాగా ఆడాలన్నారు. గురుకులంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదుల్లో వెలుతురు సరిగా లేదని, ట్యూబ్‌లైట్లు మరిన్ని ఏర్పాటు చేసి, ఫ్యాన్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కామన్ మెనూను అమలు చేయాలి
కలెక్టర్ కె.హైమావతి
మిట్టపల్లి గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ