
మార్చురీ వద్ద పడిగాపులు
విలపిస్తున్న బాధిత కుటుంబాలు
రామచంద్రాపురం/పటాన్‌చెరు టౌన్: సిగాచీ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలు తమ వారి మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు. పటాన్‌చెరు ఆస్పత్రి ప్రాంగణంలో మార్చురీ వద్ద బాధిత కుటుంబీకులు బుధవారం ఎదురు చూస్తూ కనిపించారు. మృతదేహాలను వెతుకుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
సర్పంచ్ సాయంతో విమానంలో వచ్చి...
జుమ్రత్‌మియా జార్ఖండ్ నుంచి పటాన్ చెరు ఆస్పత్రికి వచ్చారు. ఆయన కుమారుడు ఇటీవల పరిశ్రమలో కార్మికునిగా చేరాడని ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు. అయితే తన కుమారుని భౌతికకాయం మార్చురీలో ఉందంటే వచ్చినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ సహకారంతో మంగళవారం పటాన్‌చెరుకు విమానంలో చేరుకున్నాడు. బుధవారం సాయంత్రం వరకు కూడా మృతదేహం ఆయనకు ఇవ్వలేదు. ఈ సందర్భంగా జుమ్రత్ మియా అధికారులతో మాట్లాడుతూ తన కుమారుడు భౌతికకాయాన్ని ఇప్పించాలని అధికారులు వేడుకున్నారు.
పనిచేసి నెల రోజులే..
శివ్ జీ అనే కార్మికుడు బీహార్ నుంచి వచ్చి ఈ పరిశ్రమలో నెల రోజులు కూడా పనిచేయలేదు. అంతలోనే ప్రమాదం జరిగి అనంత లోకాలకు వెళ్లాడనీ శివ్‌జీ తండ్రి శంభు బిందు రోదిస్తూ చెప్పాడు. భౌతిక కాయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు.
తరలి వచ్చిన బెంగాల్ గ్రామస్తులు
అసీం తుండు అనే కార్మికుడి జాడ కోసం హరిరాజ్ పూర్ గ్రామానికి చెందిన వారు కదిలి వచ్చారు. ఆ కార్మికుడి కోసం తాము రెండు రోజులుగా వెతుకుతున్నామని చెప్పారు. అధికారులు తమకు అసీం భౌతికకాయాన్ని ఇప్పటివరకు చూపలేదని వాపోయారు.
మిన్నంటిన రోదనలు
పటాన్ చెరు మార్చురీ వద్ద తమ వారి భౌతిక కాయాలను తీసుకెళ్తూ కుటుంబీకులు బోరును విలపించారు. పరిశ్రమలో డీజీఎంగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులు భౌతిక కాయాన్ని చూసి శోక సంద్రంలో మునిగిపోయారు. అధికారులు భౌతికకాయాలను గుర్తించిన వారికి తక్షణం ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు ఇచ్చి వాహనాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

మార్చురీ వద్ద పడిగాపులు

మార్చురీ వద్ద పడిగాపులు