
ఆలయాల్లో దొంగతనం
మద్దూరు(హుస్నాబాద్): రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి, బెక్కల్ గ్రామాల్లోని దుర్గమ్మ ఆలయాల్లోకి చొరబడి హుండీ పగులగొట్టి సుమారు రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఇటీవల పలు ఆలయాలు, ఇండ్లలో దొంగలు చోరీలకు పాల్పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
నర్సాపూర్‌లో బైక్ చోరీ
నర్సాపూర్ రూరల్: పట్టణంలో పార్క్ చేసిన బైక్‌ను దొంగిలించారు. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణంలోని మారుతీనగర్‌లో దుప్తల భరత్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ముందు బైకును పార్క్ చేశాడు. ఈనెల 15న గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడు చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకపోవడంతో మంగళవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కబ్జాపై తహసీల్దార్‌కు ఫిర్యాదు
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వం గౌడ సంఘాలకు కేటాయించిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడంటూ మంగళవారం గౌడ సంఘం సభ్యులు తహసీల్దార్ శ్యామ్‌కు వినతిపత్రం అందజేశారు. మండల పరిధిలోని జప్తినాచారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొండపాక శివారులోని సర్వే నం.150లో సుమారు నాలుగెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. ఈ భూమిని 30 ఏళ్ల కిందట ప్రభుత్వం గౌడ సంఘం అభ్యున్నతి కోసం ఈత, తాటి వనాల పెంపు కోసం కేటాయించింది. ఎకై ్సజ్ శాఖ అధికారులు ఉపాఽధి హామీ పథకంలో భాగంగా ఈత, తాటి మొక్కలను నాటారు. ఇటీవల వాటిని తొలగించి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని, చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా విచారణ చేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
కుక్కల దాడిలో
26 మేకలు మృతి
జహీరాబాద్: కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో 26 మేకలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన మునావర్ పటేల్‌కు చెందిన మేకలు తన వ్యవసాయ క్షేత్రంలో ఉంచారు. సోమవారం ఆరు వీధి కుక్కలు రక్షణ వలయంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కింది వైపు నుంచి షెడ్డులోకి చొరబడి మేకలపై దాడిచేసి చంపివేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. సుమారు రూ.1.50లక్షల మేర నష్టపోయినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.
నిన్న భార్య.. నేడు భర్త
మరణంలోనూ వీడని బంధం
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన భర్త రమేష్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య సోమవారం మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామానికి చెందిన దాసరి రమేష్, స్వప్నలు భార్యాభర్తలు. సోమవారం చేగుంట మండలం మక్కరాజ్‌పేట్‌లో శుభకార్యానికి వెళ్లి తిరుగు పయనమయ్యారు. కాగా తూప్రాన్ మండలం శివారులో వీరి స్కూటీని కారు ఢీకొట్టగా స్వప్న (29) అక్కడిక్కడే మృతి చెందింది. రమేష్ (31)కు తీవ్ర గాయాలవ్వడంతో గాంధీలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఒకే రోజు గ్రామంలో భార్యాభర్తల అంతిమయాత్ర నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

ఆలయాల్లో దొంగతనం