
భూ తగాదాలో అడ్డొస్తున్నాడని హత్య
కల్హేర్(నారాయణఖేడ్): భూ తగాదాలో అడ్డొస్తున్నాడని హత్య చేసిన కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 29న సిర్గాపూర్ మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో హత్య జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం కంగ్టీ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కుర్మ సాయిగొండ, కుర్మ రమేష్ కుటుంబం మధ్య భూ తగాదాలు ఉన్నాయి. మృతుడు కార్పట్ల జైపాల్, రమేష్ ఇద్దరు స్నేహితులు. రమేష్‌కు సహకరిస్తూ భూ తగాదా విషయంలో తలదూర్చుతున్నాడనే ఉద్దేశంతో సాయిగొండ జైపాల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైపాల్, రమేష్ పొలం వద్ద పశువులకు నీరు తాపుదామని వెళ్లారు. వీరితో మార్గమధ్యలో ఘర్షణకు దిగి సాయిగొండ, అతని కొడుకులు హన్మగొండ, రాజు, పండరి, భార్య కిష్టవ్వ, కోడళ్లు కవిత, వసుధ, డాకుగొండ కలిసి గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో జైపాల్ అక్కడికక్కడే మరణించాడు. రమేష్‌కు తీవ్ర గాయలయ్యాయి. రమేష్ తల్లి మణెమ్మ, గ్రామస్తులు చూసి కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోయారు. నిందితులను రిమాండుకు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
8 మంది నిందితుల అరెస్టు, రిమాండ్
కంగ్టీ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి