
అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం
టేక్మాల్(మెదక్): అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ దొరికింది. ఈ ఘటన మండల కేంద్రంలోని టేక్మాల్‌లో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ రాజేష్ వివరాల ప్రకారం... పాప్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రావుగారి మహేష్(15) టేక్మాల్ బీసీ హాస్టల్‌లో ఉంటూ ఉన్నత పాఠశాలలో 10వ తగరగతి చదువుతున్నాడు. నిత్యం మాదిరిగానే సోమవారం హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి కనిపించకపోగా హాస్టల్‌కి వెళ్లలేదు. బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మహేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని ఎలకుర్తి గ్రామశివారులో వెళ్తున్న మహేష్‌ను గమనించి గ్రామస్తులు మాజీ సర్పంచ్ శ్వేతాచంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బీసీ హాస్టల్ వార్డెన్ బాబు అక్కడకు చేరుకొని వివరాలు సేకరించి మహేష్‌ను హాస్టల్‌కు తీసుకువెళ్లాడు.
ఫ్లైఓవర్ కింద మృతదేహం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): మృతదే హం లభ్యమైన ఘటన రామచంద్రాపురం పట్టణంలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్ కథనం ప్రకారం.. పట్టణంలోని లింగపల్లి చౌరస్తాలోని ప్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయస్సు 50 నుంచి 60ఏళ్ల మధ్య ఉండవచ్చు అని తెలిపారు. పక్కనే ఉన్న టీ దుకాణం వద్ద పదిరోజులుగా టీ తాగుతున్నట్లు దుకాణ యాజమాని తెలిపారు. మృతుని ఒంటిపై ఎర్రని చొక్క, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.