
విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య వరం
శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్
హుస్నాబాద్: హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కావడం గ్రామీణ విద్యార్థులకు ఓ వరం లాంటిందని వీసీ, ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ అన్నారు. తాత్కాలికంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఉమ్మాపూర్ మహాసముద్రం గండి వద్ద కళాశాలకు 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. భవన నిర్మాణానికి రూ.29.02 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ, ఏఐ కోర్సులకు గాను ఒక్కో కోర్సుకు 60 సీట్ల చొప్పున 240 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం సీట్లు కేటాయించామన్నారు. ప్రతి కోర్సుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించారని పేర్కొన్నారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్..
కళాశాలలో చేరేందుకు కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకారం జూన్ 28 నుంచి జూలై 7 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 6 నుంచి 10వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. 13న మాక్ కౌన్సెలింగ్, 14, 15వ తేదీల్లో ఆప్షన్ల మార్పు, 18న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 18 నుంచి 22 వరకు సెల్ఫ్ రిపోర్టు, 22న ఫైనల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్, వైస్ చాన్సలర్, ఓఎస్‌డీ డాక్టర్ హరికాంత్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్స్ తిరుపతి రెడ్డి, అశ్విని పాల్గొన్నారు.