
బడుల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం
నారాయణఖేడ్: పాఠశాలల తనిఖీకోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. ఖేడ్‌లో శనివారం నిర్వహించిన సంఘం డివిజన్‌స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులను పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యుటీ ఈవో, ఎంఈవో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలని, అవసరమైనచోట్ల కొన్ని అదనపు పోస్టులను మంజూరు చేసి ప్రత్యేక యంత్రాంగం ద్వారానే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్, సీనియారిటీ సమస్యలతోపాటు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శులు నరేశ్, ఏశప్ప, హరిసింగ్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.