
నిర్మాణాలను పరిశీలిస్తున్న అధికారులు
జోగిపేట(అందోల్)/ జహీరాబాద్ టౌన్: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో ఐదవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు ప్రాంతీయ పర్యవేక్షకులు ఎం.భీమయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. tgcet.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 11న రాత పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. వివరాలకు 180042545678 టోల్ ఫ్రీ నంబర్ లో సంప్రదించాలని సూచించారు. అలాగే తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభ కళాశాలలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామాలలో 1.50 లక్షలు, పట్టణాలలో రూ.2 లక్షలు ఉన్నవారు అర్హులని తెలి పారు. ఆన్‌లైన్‌లో tswreis.ac.in లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటలకు ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. హాల్‌టికెట్లు ఈనెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
ఫోర్జరీ సంతకాలు.. నిధులు స్వాహా
నారాయణఖేడ్: ఫోర్జరీ సంతకాలతో నిధులు కాజేసిన సర్పంచ్ కుమారుడిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి చాప్టా(కె) పంచాయతీ సర్పంచ్ పార్శెట్టి సంగమ్మ కుమారుడు విజయ్‌కుమార్ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, గ్రామైఖ్య సంఘ అధ్యక్షురాలి సంతకాలను ఫోర్జరీ చేసి మూడు విడతలుగా వాటర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి రూ.6,07,500 డ్రా చేసుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు
జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని 261 సర్వే నంబర్ అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం తహసీల్దార్ గంగాభవాని, ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిలు వాటిని పరిశీలించారు. నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు వారు తెలిపారు.
టీజేఎస్ సదస్సు జయప్రదం చేయాలి
సంగారెడ్డి టౌన్ : ‘నియంతను గద్దె దించిన ప్రజలకు జేజేలు‘ అనే నినాదంతో ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాయిలు, శ్రీధర్ మహేంద్ర, పాండు,రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బెల్ట్‌షాప్‌పై దాడి.. మద్యం పట్టివేత
పటాన్‌చెరు టౌన్: అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ఇలా ఉన్నాయి. మండల పరిధి ఐనోల్ గ్రామంలో సత్యనారాయణకు చెందిన కిరాణా దుకాణంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం సంగారెడ్డి టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందింది. దీంతో ఎస్‌ఐలు సాయిలు, పవన్ సిబ్బందితో కలిసి దాడిచేసి 282 మద్యం బాటిళ్లను (సుమారు 77,275 వేల లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. వాటిని పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పారు. నిందితుడి పై కేసు నమోదు చేసినట్లు క్రైమ్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
సంగారెడ్డి : సంగారెడ్డి సర్కిల్‌లో ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ మాధవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 9440813707, 9398884361 నంబర్లకు ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

దుకాణంలో పట్టుబడిన మద్యం బాటిళ్లు