
సంగారెడ్డి: మహిళను హత్య చేసిన నిందితుల ఇంటిని గ్రామస్తులు నిప్పంటించారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గతనెల 7వ తేదీన బైండ్ల బాలవ్వ(52) మృతి చెందగా.. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇంట్లో రక్తం మరకలు గమనించిన కుమారులు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబర్ 17న పూడ్చిన శవాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిర్వహించారు. అదేరోజు రాత్రి అనుమానితులు మద్దెల నవీన్, అతని తల్లి చంద్రవ్వను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. బాలవ్వను తామే హత్య చేసినట్లు వారు అంగీకరించారు.
నిందితులను గత నెల 19న రిమాండ్‌కు పంపారు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. బాలవ్వను నవీన్, అతని తల్లి చంద్రవ్వ హత్య చేశారని సోమవారం వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. నిందితుల ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పంటించి దహనం చేశారు. ఘటనా స్థలానికి ఏసీపీ సురేందర్‌రెడ్డి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నిందితులు రిమాండ్‌లో ఉన్నట్లు సీఐ కృష్ణ తెలిపారు.
అత్యాచారం.. ఆపై హత్య?
కాగా, బాలవ్వపై నిందితుడు నవీన్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విచారణలో నిందితులు అంగీకరించినట్లు సమాచారం. అయితే.. ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంతో బాధిత కుటుంబం పోలీసులను నిలదీయడం.. చివరకు అసలు విషయం బయటకు తెలియడంతో గ్రామస్తులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నిందితుల రిమాండ్ వ్యవహారం పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారో అంతుపట్టడం లేదు.