అధిక వడ్డీ ఆశచూపి ఓ మహిళ వద్ద రూ.41.40 లక్షలు కాజేసిన వైనం

- - Sakshi

మెదక్‌జోన్‌: అధిక వడ్డీ ఆశ చూపిన ఓ కిలాడీ లేడి ఓ మహిళ వద్ద నుంచి మూడేళ్లలో పలు విడతలుగా రూ.41.40 లక్షలు తీసుకుంది. తీరా ఆ డబ్బు ఇవ్వాలని అడిగితే నాకు నువ్వు ఏ డబ్బు ఇవ్వలేదంటూ బుకాయిస్తుందని సదరు మహిళ కన్నీటి పర్యంతమవుతోంది. మెదక్‌లోని జేఎన్‌రోడ్డులో నివాసముండే మద్దిబోయిన కృష్ణవేణి–హన్మంత్‌ దంపతులకు పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో కొంతకాలం క్రితం 2 ఎకరాల భూమి అమ్మగా రూ.60 లక్షలు వచ్చాయి. తెలిసిన వారి డబ్బు వడ్డీకి ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కృష్ణవేణికి పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ద్వారా గజ్వేల్‌కు చెందిన వడ్డీవ్యాపారం చేసే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.

నీవద్ద ఎంత డబ్బు ఉన్నా నాకు ఇస్తే అంత ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానంటూ ఆ మహిళ చెప్పిన మాయమాటలు కృష్ణవేణి నమ్మింది. మూడేళ్ల వ్యవధిలో భర్తకు తెలియకుండా కృష్ణవేణి ఏకంగా రూ.32 లక్షలు ముట్టజెప్పింది. తన డబ్బు ఇవ్వమని సదరు మహిళను కృష్ణవేణి నిలదీయగా, వడ్డీతో సహా ఇస్తానని, రూ.7.20 లక్షలు ఇస్తే చిట్టీ ముగుస్తుందని, రాగానే ఇస్తానని చెప్పింది. అనుమానం వచ్చిన కృష్ణవేణి అసలు విషయం తన భర్త హన్మంత్‌, ఇతర కుటుంబసభ్యులకు చెప్పింది. హన్మంత్‌ సదరు మహిళతో ఫోన్‌లో మాట్లాడి ఫోన్‌పే ద్వారా రూ. 7.20 లక్షలు ఆమె అకౌంట్‌కు పంపించాడు.

మరో రూ. 2.20 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే రూ.41.40 లక్షలు అవుతుందని, ఇందుకు రూ.57 లక్షలు ఇస్తానని చెప్పటంతో సరేనని చెప్పి కృష్ణవేణి తన భర్త, కొడుకు తీసుకుని గజ్వేల్‌లో ఉంటున్న ఆ మహిళ ఇంటికి వెళ్లింది. పలు నంబర్ల నుంచి ఫోన్‌ పే ద్వారా మరో రూ.2.20 లక్షలు పంపించారు. అయితే తీరా అనుకున్న సమయానికి డబ్బు అడిగితే మీరు నాకు ఏ డబ్బు ఇవ్వలేదంటూ సదరు మహిళ బుకాయించిందని బాధితులు వాపోయారు.

దీంతో చేసేది లేక గజ్వేల్‌ సీఐకి గతనెల 26న ఫిర్యాదు చేసినట్టుబాధితులు పేర్కొన్నారు. కాగా సదరు మహిళను సీఐ స్టేషన్‌కు పిలిపించి విచారించగా, నాకు డబ్బులు ఇవ్వలేదని, వారివద్ద సాక్ష్యం ఉంటే కోర్టుకు వెళ్లమని చెప్పినట్టు గజ్వేల్‌ సీఐ తెలిపారు. ఈ విషయంపై మెదక్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేసుకోవాలని సీఐ చెప్పారు. దీంతో బాధితులు మెదక్‌ ఎస్పీకి కలిసి ఫిర్యాదు చేశారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top