 
															ఔటర్‌పై ‘నో పార్కింగ్’
● ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రచారం
● రహదారి భద్రతపై అవగాహన
● జీరో డెత్ కారిడార్ లక్ష్యంగా కార్యక్రమాలు
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదాలను అరికట్టేందుకు ఐఆర్‌బీ ‘గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘ఓఆర్‌ఆర్‌పై నో పార్కింగ్’ అనే ప్రచారం చేపట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్)తో కలిసి నెల రోజుల ప్రచారం కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ‘ఓఆర్‌ఆర్‌పై పార్కింగ్ సురక్షితం కాదు’ అనే కీలకమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం ఈ ప్రచారం లక్ష్యం. హైస్పీడ్ కారిడార్ మీద అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వాహనదారులకు అవగాహన కల్పించేందుకే దీన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
● 158 కిలోమీటర్ల పొడవున్న ఓఆర్‌ఆర్‌పై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కొన్నిచోట్ల వాహనాలను పార్కింగ్ చేయడంతో తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలావరకు లారీలు, ట్రక్కులను ఇలా పార్క్ చేయడంతో ఇవి వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నట్లు గుర్తించారు. ప్రమాదాన్ని సూచించే లైట్లు లేదా రిఫ్లెక్టివ్ వార్నింగ్ పరికరాలు ఏవీ లేకుండానే ఇలా అక్రమంగా భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని భద్రతాధికారులు, నిపుణులు హెచ్చరించారు
ఇది పార్కింగ్ జోన్ కాదు..
హెచ్‌జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తూ.. ఔటర్ రింగురోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్లడానికే.. పార్కింగ్ కోసం కాదన్నారు. ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే డైరెక్టర్ మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్ అంతర్జాతీయ మొబిలిటీ కారిడార్ అని, అది హైదరాబాద్ వృద్ధి, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ ప్రచారంలో ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, దాని భాగస్వా ములు కలిసి క్షేత్రస్థాయిలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలు, వాణిజ్య డ్రైవర్లతో, లాజిస్టిక్ సంస్థల నిర్వాహకులు, ప్రైవేటు వాహనాల యజమానులతో సెషన్లు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
