 
															ఫోం పరిశ్రమలో అగ్నిప్రమాదం
షాద్‌నగర్‌రూరల్: ఫోం పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఈ సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధి చెల్కచిల్కమర్రి గ్రామశివారులోని ఓ పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూఎర్త్ పాలీఫోం పరిశ్రమలో సుమారు 40 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్లాస్టిక్‌ను రీ సైక్లింగ్ చేసి, ఫోం తయారు చేస్తున్న ఆర్‌పీపీ యంత్రంవద్ద అభిషేక్, లాలుబాబులు పనిచేస్తుండగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎలాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో ఇద్దరికి గాయాలు అయ్యా యి. తోటి కార్మికులు వీరిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం శంషాబాద్‌కు తీసుకెళ్లారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకొని ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పరిశ్రమలో పక్క గోదాంలో నిల్వ ఉంచిన ఫోం మెటీరియల్‌కు మంటలు వ్యాపించలేదు. నిప్పు అంటుకొని ఉంటే భారీ ప్రమాదం జరిగి, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేది.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ లక్ష్మీనారాయణ.. పట్టణ సీఐ విజయ్‌కుమార్, సిబ్బందితో కలిసి పరిశ్రమను పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలను తెలుసుకున్నారు. ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారు, ప్రమాదంలో గాయపడిన వారి వివరాలను సేకరించారు. సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.
ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
