
పరిహారం మెరుగు!
యాచారం: ఫార్మా రైతులకు త్వరలో తీపి కబురు అందనుందా అంటే ఔననే సమాధానం వస్తోంది. బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వడం లేదని మొండికేసిన రైతుల భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసిన రైతులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన భూ రికార్డులను తమ పేరిట మార్చాలని రైతులు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు సానుకూల ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు నిత్యం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్‌ఏ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. భూరికార్డుల మార్పుతో నాలుగేళ్లుగా బాధిత రైతులు రైతు బంధు, రైతు భరోసా, బ్యాంకు రుణాల మాఫీ కోల్పోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో విక్రయించుకుందామంటే అవకాశమే లేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు అధికారంలోకి వచ్చాక స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
నాలుగేళ్లుగా బాధిత రైతుల చక్కర్లు
యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి 9,851 ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సేకరించడానికి నిర్ణయించారు. అందులో భాగంగా 7,640 ఎకరాలు సేకరించారు. నిర్ణయించిన మేరకు పరిహారం అందజేశారు. ఆయా గ్రామాల్లో దాదాపు 1,500 మందికి పైగా రైతులకు చెందిన 2,211 ఎకరాల పట్టా భూమిని ఫార్మాకు ఇవ్వాలని అప్పట్లో అధికారులు తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. రైతులు ససేమిరా అనడంతో రాత్రికిరాత్రే అవార్డులు పాస్ చేసి, పరిహారం డబ్బులను అథారిటీలో జమ చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేశారు. నాలుగేళ్లుగా ఆయా గ్రామాల రైతులు తమ పేర్ల మీద మార్చాలని అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
గతంలోకంటే మెరుగ్గా..
పట్టా రైతుల భూ రికార్డుల విషయం కోర్టు పరిధిలో ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. విషయాన్ని కొద్దిరోజుల క్రితం రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతులు భూమికి భూమి ఇచ్చినా పరవాలేదు అంటుండగా సర్కార్‌లోని పెద్దలు మాత్రం భూమికిభూమి ఇస్తే రాష్ట్రమంతా అదే సమస్య వస్తుందనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు గతంలో ఇచ్చిన దానికంటే మెరుగైన పరిహారం ఇప్పించి, మెప్పించేలా దృష్టి సారించినట్టు తెలిసింది. పట్టా భూములకు మొదట్లో ఎకరాకు రూ.12.50 లక్షలు, ఆ తర్వాత రూ.16 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెంచి ఇచ్చారు. పరిహారంతో పాటు ఎకరా భూమికి 121 గజాల ప్లాటు ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు రూ.50 లక్షలలోపు పరిహారం, ఎకరాకు 121 గజాల ప్లాటు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రైతులకు తీపి కబురు అందించనున్నట్టు తెలుస్తోంది.
ఫార్మా రైతులకు తీపి కబురు
న్యాయం జరిగేలా సర్కార్ దృష్టి
ఎకరాకు రూ.50 లక్షలలోపు పరిహారం, 121 గజాల ప్లాటు ఇచ్చేలా యోచన
నాలుగేళ్ల నిరీక్షణకు తెర