
స్మార్ట్ ‘ఫ్యూచర్’
20 ఏళ్ల అవసరాలు తీర్చేలా.. నాలుగో నగరి
● ప్రపంచ నగరాలతో పోటీపడేలా అభివృద్ధి
● ఫోర్త్ సిటీకు రెండు మాస్టర్ ప్లాన్లు
● 14 వేల ఎకరాల టీజీఐఐసీ భూములకు ఒకటి..
● 2 లక్షల ఎకరాల అథారిటీ పరిధికి మరొకటి
● 5 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ శాశ్వత కార్యాలయం
● వారం రోజుల్లో 34 రెగ్యులర్ పోస్టుల భర్తీ: ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె.శశాంక
సాక్షి, రంగారెడ్డి జిల్లా : దేశంలోనే తొలి నెట్ జీరో సిటీగా నిలవనున్న ఫ్యూచర్ సిటీ (నాలుగో నగరం).. స్థిరమైన, సమగ్రమైన స్మార్ట్ పట్టణీకరణ నగరంగా అభివృద్ధి చెందనుంది. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా గ్రేటర్ హైదరాబాద్‌కు దక్షిణ భాగంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూ పొందించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జాతీయ రహదారుల మధ్య అభివృద్ధి చేయనున్న ఈ ప్రతిష్టాత్మక నాలుగో నగరం 765.28 చదరపు కిలో మీ టర్ల మేర విస్తరించి ఉంటుందని ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) తొలి కమిషనర్ కె.శశాంక పేర్కొంటున్నారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్ ప్రణాళికలపై ఆయన ఏమంటున్నారంటే..
భవిష్యత్ నగరి ఎలా ఉంటుందంటే?
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్‌లో నాలుగో నగరం అవసరం ఉందని సీఎం రేవంత్ నిర్ణయించారు. మహేశ్వరం, ఆమన్ గల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఏడు మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్‌సీడీఏ పరిధిలోకి వస్తాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ తరహాలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కాలుష్య రహిత వాతావరణం ఈ నగరం ఉంటుంది. ఫోర్త్ సిటీకి ప్రతిష్టాత్మకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక పాలసీలు, ప్రోత్సాహకాలు కల్పించనున్నాం.
మాస్టర్ ప్లాన్ ఇలా..
ఫార్మాసిటీ కోసం టీజీఐఐసీ ఇప్పటికే 14 వేల ఎకరాల భూమిని సేకరించింది. ఈ భూముల వరకూ ఒక మాస్టర్ ప్లాన్, ఎఫ్‌సీడీఏ పరిధి విస్తరించి ఉన్న సుమారు 2 లక్షల ఎకరాల వరకూ మరో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించనున్నాం. ప్రత్యేక జోన్‌లతో ఈ మాస్టర్ ప్లాన్‌లు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. అథారిటీ కోర్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో టీజీఐఐసీ మాస్టర్ ప్లాన్‌ను ఇంటిగ్రేటెడ్ చేస్తాం. ఈ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన బాధ్యతలు హెచ్‌ఎండీఏకు ఇవ్వాలని సూత్రప్రాయంగా భావిస్తున్నాం.
బడ్జెట్ కేటాయింపులు..
తొలి విడతగా ప్రభుత్వ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించింది. మాస్టర్ ప్లాన్ అభివృద్ధితో పాటు రహదారులు, విద్యుత్, నీరు వంటి మౌలిక అవసరాలకు ఖర్చు చేయనున్నాం. ఇతరత్రా వ్యయాల కోసం మరో విడత బడ్జెట్‌ను విడుదల చేయాలని ఇటీవలే ఆర్ధిక శాఖకు ప్రతిపాదనలు నివేదించాం.
ఎఫ్‌సీడీఏలో సిబ్బంది భర్తీ ఎప్పుడు పూర్తవుతుంది?
ఎఫ్‌సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ముందుగా ప్లానింగ్, ఇంజినీరింగ్ వంటి పలు విభాగాలలో 34 పోస్టుల భర్తీ ఉంటుంది. మున్సిపల్, హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్ వంటి పలు విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై రానున్నారు. సీఎంవోకు ఫైల్ చేరింది. వారం రోజుల్లో భర్తీ పూర్తవుతుంది.
A
ఈ సిటీలో ఏం ఉంటాయంటే?
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అనుసంధానిస్తూ ఫ్యూచర్ సిటీకి మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, గ్రీన్ బిల్డింగ్, స్మార్ట్ లివింగ్ ఎకో సిస్టమ్ ఉంటుంది. ఇందులో కృత్రిమ మేధ (ఏఐ), ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ వంటి ప్రత్యేక జోన్లు ఉంటాయి. ఫోర్త్ సిటీలో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

స్మార్ట్ ‘ఫ్యూచర్’