
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగైదు అంతస్తుల భవనాలను యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో అక్రమ నిర్మాణదారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
తొమ్మిది గ్రామ పంచాయతీల విలీనంతో మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పడింది. మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్, చిలుకూరు, మొయినాబాద్, సురంగల్, పెద్దమంగళారం, అప్పోజీగూడ, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్‌నగర్ గ్రామాలు గతంలో పంచాయతీలుగా ఉన్నాయి. మున్సిపాలిటీ ఏర్పాటు కావడంతో ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల మధ్యలో మొయినాబాద్ మున్సిపాలిటీ 111 జీవో పరిధిలో ఉంది. జీవో ప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలులేదు. కానీ వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఒక్కో భవనాన్ని నాలుగు నుంచి ఆరు అంతస్తులకు పైగా నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. హిమాయత్‌సాగర్ జలాశయం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో సైతం నిర్మాణాలు జరుగుతున్నా ఆపేవారే కరువయ్యారు.
నోటీసులిచ్చి వసూళ్ల పర్వం
అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎక్కడైనా నిర్మాణం జరుగుతుందంటే అక్కడికి వెళ్లి ముందుగా నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణదారులు నేరుగా పై అధికారులను కలిసి ముడుపులు ముట్టజెబుతున్నారు. దీంతో అటువైపు ఎవరూ వెళ్లకుండా పై అధికారులు కింది స్థాయి అధికారులు, సిబ్బందికి హుకూం జారీ చేస్తున్నారు. గోడల నిర్మాణం చేపట్టి వెంటనే తెల్లరంగు వేయాలని అక్రమ నిర్మాణాలు చేసేవారికి అధికారులే సలహాలు ఇస్తున్నారు. నిర్మాణం పూర్తయిన వెంటనే ఇంటి నంబర్‌కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో ఓ కోటరీ తయారైనట్లు తెలుస్తోంది.
అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు
మామూళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు
నోటీసులు ఇస్తున్నాం
ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే నోటీసులు ఇస్తున్నాం. పనులు ఆపేస్తున్నాం. కొందరు నోటీసులు ఇచ్చినా మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారికి మరోసారి నోటీసులిచ్చి నిర్మాణాలను అడ్డుకుంటాం.
– ఖాజా మొయిజుద్దీన్, కమిషనర్

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!