గీతా పఠనం.. మోక్ష సాధన మార్గం
సిరిసిల్లకల్చరల్: ముక్తి మార్గ సాధనకు, వ్యక్తిత్వ నిర్మాణానికి భగవద్గీత పారాయణం దోహదం చేస్తుందని రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గీతానగర్‌లోని మళయాల సద్గురు గీతాశ్రమంలో ఐదురోజులుగా గీతా జ్ఞానయజ్ఞం సాగుతుండగా మంగళవారం ముగింపు సమావేశానికి హాజరై మాట్లాడారు. గీతా సారాంశాన్ని జీర్ణించుకుని జీవితాన్ని ధర్మ మార్గంలో కొనసాగించాలని సూచించారు. గీత ప్రచార సమితి ఆవిర్భావ పూర్వాపరాలను సమితి కార్యదర్శి కోడం నారాయణ వెల్లడించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించిన బ్రహ్మచారి అక్షయ చైతన్యను సమితి ప్రతినిధులు సత్కరించారు. గీతా పఠన పోటీల్లో విజేతలైన విద్యార్థులు జి.శివన్, వాత్సల్య, కె.తేజశ్రీ, ఎం.మేధస్వి, సీహెచ్.లాత్విక, ఎం.హాసినిలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. డాక్టర్ జనపాల శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, ఏనుగుల ఎల్లయ్య దాసరి రాజేశ్, చిన్మయ మిషన్ కార్యదర్శి నల్ల సత్యనారాయణ, మేరుగు మల్లేశం, గోశికొండ దామోదర్, జయమ్మ, గడ్డం కౌసల్య, శారదా సారంగం తదితరులు పాల్గొన్నారు.


