యువశక్తి..పఠనాసక్తి
సిరిసిల్లటౌన్: డిజిటల్ యుగంలో సోషల్‌మీడియా ప్రభావం చూపుతున్న కాలంలోనూ సిరిసిల్ల యువత పుస్తకాల పురుగులుగా మారిపోయారు. జ్ఞాన సముపార్జనకు జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నిత్యం వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు జిల్లా గ్రంథాలయంలో పోటీపరీక్షల పుస్తకాలు చదువుతూ కొలువులు సాధిస్తున్నారు. ఎక్కువగా పేదలు ఉండే కార్మికక్షేత్రం సిరిసిల్లలో ప్రభుత్వం ఉచితంగా విజ్ఞానాన్ని అందించేందుకు జిల్లా గ్రంథాలయాన్ని నిర్వహిస్తోంది. ఇందులోని పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటూ పలువురు ఉద్యోగాలు సాధించారు. ఆశయ సాధనకు పఠనాసక్తిని కనబరస్తున్న యువతరంపై ప్రత్యేక కథనం.
40 వేల పుస్తకాలు
సిరిసిల్లలోని జిల్లా గ్రంథాలయంలో దాదాపు 40వేల పుస్తకాలున్నాయి. నిత్యం 200 మందికి పైగా అన్ని వయస్సుల వారు వస్తుంటారు. బుక్స్ సెక్షన్, రీడింగ్ సెక్షన్, డైలీ పేపర్స్ రీడింగ్ సెక్షన్లు రద్దీగా కనిపిస్తుంటాయి. నీట్, డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, పోలీస్, గ్రూప్స్, సివిల్స్, యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్‌డీఏ పోటీపరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. చితంగా వైఫై సౌకర్యం ఉంది. ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పోటీపరీక్షల పుస్తకాలు కావాలంటే పాఠకుల కోరిక మేరకు వెంటనే పాలకవర్గం తెప్పిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
మెరుగైన వసతులు
● పోటీపరీక్షలకు సన్నద్దమయ్యే బీఎస్‌ఆర్‌బీ, టీఎస్‌పీఎస్సీ, ఆర్మీ, రైల్వే రిక్రూట్‌మెంట్లు, గ్రూపు–1, గ్రూపు–2, గ్రూపు–3, గ్రూపు–4, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు ఉన్నయి.
● నవలలు, వీక్లీ మ్యాగజైన్స్‌తోపాటు ఇతర పుస్తకాలు ఉన్నాయి.
● కరెంటు అఫైర్స్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.
కొన్ని సమస్యలు
● పాఠకుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ లేవు.
● సెలవు రోజుల్లో లైబ్రరీ మూసివేసి ఉంటుంది.
● గ్రంథాలయం తెరిచి ఉంచే సమయాన్ని కొంచెం పెంచాలని పాఠకులు కోరుతున్నారు.
● శుక్రవారం కూడా బుక్స్ సెక్షన్‌లో పుస్తకాలు తీసుకుని చదువుకునే అవకాశం కల్పించాలనే కోరుతున్నారు.


