 
															మన బస్సు భద్రమేనా ?
నిబంధనలు పాటించాలి
కాంట్రాక్టు క్యారేజెస్(ప్రైవేటు బస్సులు):45
ఆర్టీసీ బస్సులు : 137
స్కూల్ బస్సులు : 157
సిరిసిల్లటౌన్: జిల్లాలో ప్రైవేట్ బస్సులు నిబంధనలు పాటించడం లేదు. కొందరు యజమానులు పర్మిట్ తీసుకోకుండానే రోడ్లపై తిప్పుతుండడం.. మరికొందరైతే పర్మిట్ పరిధి దాటి రావడం.. వీరికి తోడు ఆర్టీసీ బస్సులు సైతం నిబంధనలు పాటించ డం లేదు. ఇవన్నీ ఇటీవల రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో ఇటీవల ప్రైవేట్ బస్సు ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోయిన ఘటన నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం తనిఖీలు పకడ్బందీగా చేస్తున్నారు.
ప్రైవేటు బస్సులు ఇవీ పాటించాలి
పర్మిట్ ఎంత వరకు తీసుకుంటే ఆ ప్రాంతంలోనే బస్సులు నడపాలి. ప్రమాదాల సమయంలో ప్రయాణికులను కాపాడేందుకు అగ్నిమాపక పరికరాలు బస్సుల్లో ఉంచాలి. ప్రయాణికులను తరలించే బస్సుల్లో సరుకు రవాణా చేయొద్దు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించాలి. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.
పాఠశాల బస్సుల నిబంధనలు ఇవీ..
● ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ ఉండాలి.
● బస్‌లో మంటల చెలరేగితే వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిలిండర్ ఉండాలి.
● ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. కిటికీలకు మెస్ లేదా రాడ్స్ ఏర్పాటు చేయాలి.
● సీనియర్ డ్రైవర్లను నియమించాలి. డ్రైవర్ల ఫిజికల్ ఫిటినెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించకూడదు.
● అన్ని బస్సులలో అటెండర్లు ఉండాలి.
నిబంధనల ఉల్లం‘ఘనులు’
● ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ స్కూల్ బస్సును అధికారులు తనిఖీ చేశారు. శ్రీ ఆరోగ్య ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో స్కూల్ బస్సు నడుపుతన్నారు. ఆ పేరుతో జిల్లాలో ఎలాంటి విద్యాసంస్థ లేదు. దీంతో రూ.44,800 రోడ్డు ట్యాక్సి, రూ.2,550 కాంపౌండబుల్ ఫీజు జరిమానా విధించారు.
● జూన్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన శ్రీవాణి హైస్కూల్ బస్సు సిరిసిల్ల ప్రాంతానికి అద్దైపె పంపించారు. అధికారుల తనిఖీలో బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదని తేలింది. ఎలాంటి పర్మిట్ లేకుండా జిల్లా దాటి రావడంతో అధికారులు రూ.5,825 జరిమానా విధించారు.
● ఇల్లంతకుంటకు చెందిన ఓ విద్యాసంస్థ బస్సు జూన్‌లో సిరిసిల్ల పట్టణానికి వచ్చింది. రవాణాశాఖ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో సదరు బస్సును తనిఖీ చేయగా ఫిట్‌నెస్, డ్రైవర్‌కు లైసెన్స్ లేదు. దీంతో కేసు నమోదు చేసి రూ.10,550 జరిమానా విధించడంతోపాటు మందలించి వదిలేశారు.
బస్సుల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఆర్టీసీ, ప్రైవేటు, పాఠశాలల బస్సులను సకాలంలో ఫిట్‌నెస్ చేయించాలి. పాఠశాల బస్సుల్లో విద్యార్థులకు రక్షణ కల్పించే క్రమంలో ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల పరివర్తన, డ్రైవింగ్ లెసెన్సు, ఇన్సూరెన్స్ తదితర విషయాలపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలు పూర్తిగా అమలు చేస్తాం. – వి.లక్ష్మణ్, జిల్లా రవాణాశాఖాధికారి, సిరిసిల్ల
 
							మన బస్సు భద్రమేనా ?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
