 
															పర్యావరణ అనుమతి ఉంటేనే కొత్త లీజులు
● అదనపు కలెక్టర్ నగేశ్
సిరిసిల్ల: పర్యావరణ అనుమతులు ఉంటేనే మైనింగ్ లీజులకు, రెన్యూవల్స్‌కు అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా సర్వే నివేదిక కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ, గనుల లీజులకు అనుమతులు ఇవ్వాలన్నా ముందుగా పర్యావరణ అనుమతి పొందాలన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని జిల్లా పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సూచించారు. మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, సీ పీవో మల్లేశం, వైద్యాధికారి అనిత, అటవీ క్షేత్ర అధికారి శ్రీహరిప్రసాద్, భూగర్భజల శాఖ డీడీ, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.
తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. గోపి మాట్లాడుతూ అధికారులు రైసుమిల్లర్లతో మాట్లాడి తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసేలా చూడాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండలాధ్యక్షుడు కోడె రమేశ్, నాయకులు మల్లేశ్‌యాదవ్, గంట అశోక్, నాగరాజుగౌడ్, మహేశ్‌యాదవ్, సత్యనారాయణ, రవీందర్, సర్వోత్తం, వాజిద్ హుస్సేన్, దేవేందర్‌యాదవ్ పాల్గొన్నారు.
రుద్రంగి(వేములవాడ): యువత మత్తుపదార్థాలు, చెడు వ్యసనాలకు అలవాటుపడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని జిల్లా అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి కోరారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలుసుకున్నారు. వివిధ రికార్డులు పరిశీలించారు. అంకితభావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు, అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పొలీసులకు సమాచారం అందించాలని కోరారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై గంగరాజు ఉన్నారు.
 
							పర్యావరణ అనుమతి ఉంటేనే కొత్త లీజులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
