
రైతుల సంక్షేమమే లక్ష్యం
కోనరావుపేట(వేములవాడ): రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మల్కపేటలోని మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆదివారం నీటిని విడుదల చేశారు. సభలో మాట్లాడుతూ మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగారం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళపల్లి, వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ఇదివరకు మెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండా, అల్మాస్‌పూర్, రాజన్నపేట, దేవునిగుట్టతండా, గొల్లపల్లి బాకూరుపల్లి, తిమ్మాపూర్ వరకు నీటిని విడుదల చేశామన్నారు. సుమారు 5వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. సిరిసిల్ల, వేములవాడ, కోనరావుపేట మండలాల్లోని 25,694 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపారు. ఎడమకాలువ కోసం ఇప్పటి వరకు 70 ఎకరాలు సేకరించామని, మరో 70 ఎకరాలు భూసేకరించనున్నట్లు ప్రకటించారు.
ధర్మారంలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం
మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ధ్రుడ సంకల్పంతో ఉందన్నారు. కోనరావుపేట మండలం ధర్మారంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని తెలిపారు. ఇప్పటికే రూ.30లక్షలతో ఎలక్ట్రిక్ బస్సు మంజూరు చేశామన్నారు. మహిళలు ముందుకొస్తే మండలానికో రైస్‌మిల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మల్కపేటలో మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు కుటుంబీకులు నిర్మించిన రామాలయాన్ని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నీటిపారుదలశాఖ అధికారి అమరేందర్‌రెడ్డి, ఈఈ కిశోర్, డీఈలు సత్యనారాయణ, వినోద్, శ్రీనివాస్, డీఆర్‌డీవో శేషాద్రి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్‌చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు, ఏఈలు సురేశ్, శ్రీశైలం, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ నుంచి నీటి విడుదల