
ధూప, దీపాలకు వేళాయె
● ఆలయాలకు ఆర్థిక సాయానికి కొత్త దరఖాస్తులు ● ఉమ్మడి జిల్లాలో 900వరకు ఆలయాలు ● చిన్న ఆలయాలకు రెండు మూడు నెలలకోసారి వేతనాలు ● గౌరవ భృతి పెంచాలని డిమాండ్ ● ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయం కావాలంటున్న అర్చకులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఆలయాల్లో ధూప, దీపాలకు వేళయింది. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలకు ధూపదీప నైవేద్యాల (డీడీఎన్‌స్కీమ్) పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పథకం కింద ఎంపికయిన ఆలయానికి ప్రతినెలా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఇందులో రూ.4000 ధూపదీప నైవేద్యాలకు, మిగిలిన రూ.6000 కింద గౌరవ భృతి కింద చెల్లిస్తారు. ఈ పథకం కోసం ఈనెల 24వరకు దరఖాస్తులు కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం నిబంధనలు రూపొందించి, ఆ మేరకు అర్హత, ఆసక్తి కలిగిన ఆలయాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆలయం నిర్మాణమై కనీసం 15ఏళ్లు అయి ఉండాలని ప్రాథమిక నిబంధన విధించారు. వీటితోపాటు దరఖాస్తు ఫారంలో మిగిలిన నిబంధనలు పొందుపరిచారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవభృతి పెంచాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఆరోగ్య బీమా కల్పించాలని అర్చకులు కోరుతున్నారు.
వైఎస్ హయాంలో మొదలై
2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకం రూపుదిద్దుకుంది. అప్పట్లోఽ ధూపదీప నైవేద్యాల కోసం రూ.2500 చొప్పున ఆనాటి ఖర్చులకు అనుగుణంగా చెల్లించేవారు. ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాల మాదిరిగానే ఈ పథకం కూడా రాష్ట్రం విడిపోయినా కొనసాగుతుండటం గమనార్హం. రూ.2500 నుంచి క్రమంగా ఆర్థికసాయం రూ.10,000కు చేరుకుంది. ధూపదీప నైవేద్యాల ఖర్చులకు 2018లో ఈ మొత్తం రూ.6000గా నాటి సీఎం కేసీఆర్ పెంచారు. తరువాత రూ.10,000 పెంచుతూ జీవో విడుదల చేసినా.. ప్రస్తుత సీఎం రేవంత్ హయాంలో అమలవుతోంది. చూసేందుకు చిన్నమొత్తంగా కనిపించినా.. పూజారులకు ఇస్తున్న గౌరవ భృతిని అన్ని ప్రభుత్వాలు ఆదరిస్తున్నాయి. అదే సమయంలో పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని పలువురు పూజారులు డిమాండ్ చేస్తున్నారు.
చివరిసారిగా 2022లో
ప్రతీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆలయాలు ఈ పథకానికి ప్రాథమిక అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2022లో చివరిసారిగా నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత నోటిఫికేషన్ వచ్చింది. ధూపదీప నైవేద్యాల కింద ఉమ్మడి జిల్లాలో 898 ఆలయాలు ఈ పథకం కింద నెలనెలా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం పొందుతున్నాయి. మూడేళ్ల కాలంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆలయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మరో వంద వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ధూప, దీప నైవేద్యం పథకం కింద ఆలయాలు
ఫేజ్–1 ఫేజ్–2 ఫేజ్–3 మొత్తం
కరీంనగర్ 118 71 67 256
జగిత్యాల 153 67 102 322
పెద్దపల్లి 64 40 49 153
రాజన్నసిరిసిల్ల 83 36 48 167