● సిరిసిల్ల మున్సిపాలిటీలో తాగునీటి గోస ● శివారు పల్లెల్లో కన్నీటి కష్టాలు ● విలీన గ్రామాల్లో ‘మిషన్ ట్రబుల్’ ● నీరింకిన బోర్లు..పాడయిన మోటార్లు ● ప్ర‘జల’ కష్టాలపై ప్రణాళిక లేమి ● జిల్లా కేంద్రంలో దాహం..దాహం
సిరిసిల్లటౌన్: ఎండాకాలం ఆరంభంలోనే కార్మికక్షేత్రం సిరిసిల్లలో నీటి కటకట మొదలైంది. మున్సిపల్ విలీన గ్రామాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. శివారు ప్రాంతాల్లోని కొన్ని ఏరియాల్లో మిషన్ భగీరథ ద్వారా అందాల్సిన తాగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్‌బోర్లు నిర్వహణ లోపంతో పనిచేయడం లేదు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నీటి కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.
ప్రణాళిక లేమితో కష్టాలు
తలాపునే మానేరు నది పారుతున్నా ఏళ్లుగా సిరిసిల్లలో తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఏటా వేసవిలో నీటి కోసం మున్సిపల్ ప్రజలు ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని ఏరియాల్లో వందల మీటర్ల దూరం నడిచి నెత్తిన బిందెలతో తాగు, ఇతర అవసరాలకు నీరు తెచ్చుకుంటున్నారు. సిరిసిల్లలో మున్సిపల్‌కు సంబంధించిన 450 పవర్‌బోర్లు ఉన్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యంతో ప్రస్తుతం అవి పాడయ్యాయి. వాటిని మరమ్మతు చేయడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. ప్రతిరోజు సిరిసిల్ల వ్యాప్తంగా ప్రజల అవసరాలకు 16 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తారు. ఇందులో 8 ఎంఎల్‌డీ మిషన్ భగీరథ, 8 ఎంఎల్‌డీ పవర్‌బోర్ల ద్వారా సరఫరా జరుగుతోంది.
వార్డుల్లో నీటికష్టాలు ఇలా..
● విద్యానగర్, సుభాష్‌నగర్, సాయినగర్, పద్మనగర్, నీళ్లట్యాంకుల పరిధిలో నల్లానీరు సరఫరా అవుతోంది.
● కార్మికవాడలు బీవైనగర్, తారకరామనగర్, సుందరయ్యనగర్, ఇందిరానగర్, గణేశ్‌నగర్, శివనగర్, ప్రగతినగర్, జేపీనగర్‌తోపాటు విలీన గ్రామాలు చంద్రంపేట, రగుడు, రాజీవ్‌నగర్, పెద్దూరు, శివారు పల్లెల ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
● ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం లేదని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
● పెద్దూరు, రగుడులోని చాలా ప్రాంతాల ప్రజలు ఇప్పటికే మున్సిపల్ అధికారులకు, జిల్లా కలెక్టరేట్‌లో పలుసార్లు ఫిర్యాదులు చేసినా ప్ర‘జల’ కష్టాలు తీరకపోవడం గమనార్హం.
సిరిసిల్లలో మిషన్ భగీరథ స్వరూపం
జనాభా : 1,10,000
వార్డులు : 39
నివాసాలు : 31,601
ప్రస్తుతం ఉన్న నల్లాలు : 16,510
పైపులైన్ పొడవు : 139.80 కిలోమీటర్లు
అంతర్గత పైపులైన్ : 130.5 కిలోమీటర్లు
ప్రధాన పైపులైన్ : 9.5 కిలోమీటర్లు
నిర్మాణ వ్యయం : రూ.60కోట్లు
ఈ ఫొటో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గుర్రపుకాలనీవాసుల కన్నీళ్ల కష్టాలకు నిలువెత్తు సాక్ష్యం. తమ కాలనీలో ముప్పై గడపలు ఉండగా.. రెండు పవర్‌బోర్లతో నీళ్లు అందేవి. పక్షం రోజులుగా రెండూ పాడయ్యాయి. 500 మీటర్ల దూరంలో ఉండే పొలాల్లోంచి ఇలా నీళ్లు ఎత్తుకొస్తున్నారు.
ఇది సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మొదటి వార్డులోనిది. చంద్రంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాగునీటి సరఫరా అందకపోవడంతో ఇలా ఇంటి ముందు యజమానితో మాట్లాడి పాఠశాలకు పైపుద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ఈవిషయం మున్సిపల్ టోల్ ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
ఇది రగుడు ప్రాంతంలోని బోరు. దీని ద్వారానే నిత్యం వందలాది మంది నీరు తీసుకెళ్లేవారు. బోరులో నీరు ఎండిపోయి ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పలుసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గొంతెండుతోంది
గొంతెండుతోంది
గొంతెండుతోంది
గొంతెండుతోంది
గొంతెండుతోంది