● మరో ఇద్దరికి గాయాలు
బల్లికురవ: పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వలస వచ్చిన కార్మికుల జీవితాల్లో మద్యం చిచ్చు రేపింది. మద్యం మత్తులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణాన్ని బలిగొనగా, మరో ఇద్దరిని ఆసుపత్రి పాలుచేసింది. ఈ విషాదకర ఘటన సోమవారం అర్ధరాత్రి బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి – అనంతవరం ఆర్‌అండ్‌బీ రోడ్డులో వేమవరం జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చిన చరణ్(40), మరో కార్మికుడు కలిసి సోమవారం రాత్రి పూటుగా మద్యం తాగారు. అనంతరం వారిద్దరూ వేమవరం జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక బైక్ వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వలస కార్మికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన చరణ్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడితో పాటు బైక్‌పై నుంచి కిందపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బల్లికురవ ఎస్సై వై. నాగరాజు తెలిపారు.


