రొయ్యల ఫీడ్‌ ధరలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

రొయ్యల ఫీడ్‌ ధరలు తగ్గించాలి

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

ప్రభుత్వం జోక్యం చేసుకొని రొయ్య రైతులను ఆదుకోవాలి పెంచిన ఫీడ్‌ ధరలను నిరసిస్తూ ప్రకాశం భవన్‌ ముందు ధర్నా

ఒంగోలు సబర్బన్‌: రొయ్యల ఫీడ్‌ కంపెనీలు పెంచిన ఫీడ్‌ ధరలను తక్షణమే తగ్గించాలని జిల్లా రొయ్యల రైతుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం రొయ్యల రైతుల సంఘ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు దుగ్గినేని గోపినాథ్‌ అధ్యక్షతన ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రొయ్యల రైతుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా దుగ్గినేని గోపీనాథ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రొయ్యల రైతులు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రొయ్యలు సాగు చేస్తున్నారన్నారు. రొయ్యల సాగులో పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, తగ్గిన రొయ్యల ధరల వలన వనామీ రొయ్యలు సాగు చేసిన రైతులకు 60 కౌంట్‌ వరకు పెంచితేగానీ పెట్టిన పెట్టుబడి తిరిగి రావటం లేదన్నారు. 100 కౌంట్‌ నుంచి 70 కౌంట్‌ వరకు రొయ్యలు పెంచిన రైతులకు కౌంట్ల వారీగా కేజీకి రూ.40 నుంచి రూ.30 వరకు పెట్టిన పెట్టుబడిలో నష్టపోతున్నారని, టైగర్‌ రొయ్యలు సాగు చేసిన రైతులకు 40 కౌంటు వరకు పెంచితే గానీ పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఫీడ్‌ కంపెనీలు వనామి ఫీడును కేజీకి రూ.10, టైగర్‌ ఫీడ్‌ను రూ.12 అప్సడా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రైతుల అభ్యంతరం పట్టించుకోకుండా ఏకపక్షంగా పెంచాయన్నారు. పెంచిన ఫీడ్‌ ధరలను ఖర్చులో పరిగణలోకి తీసుకుంటే వనామీ సాగుచేసిన రైతులకు 40 కౌంటుకు రొయ్యలను పెంచితే గానీ పెట్టుబడి ఖర్చులు రావన్నారు. వనామి రొయ్యల మొత్తం సాగులో కేవలం 10 శాతం మాత్రమే 40 కౌంట్‌కు రొయ్యలు ఎదుగుతాయని, మిగతా 90 శాతం రైతులు 100 నుంచి 50 కౌంట్‌ లోపే రొయ్యలను హార్వెస్ట్‌ చేస్తారని చెప్పారు.

టైగర్‌ రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం పెరిగిన రొయ్యల ఫీడ్‌ ధరలు వలన 30 కౌంట్‌కు పెరిగితే గానీ పెట్టుబడి ఖర్చులు వచ్చే పరిస్థితి లేదన్నారు. పెరిగిన ఫీడ్‌ ధరలు ఇదే విధంగా కొనసాగితే మొత్తం రొయ్యల రైతుల్లో ఒక సంవత్సరంలోపే 80 శాతం మంది రొయ్యల సాగుకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల ఉత్పత్తి తగ్గి ప్రాసెసింగ్‌ ప్లాంట్స్‌ మూతపడే ప్రమాదం ఉందన్నారు. ధర్నాకు ముందు మత్స్యశాఖ కార్యాలయం నుంచి చర్చి సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు రొయ్యల రైతులు నిరసన ప్రదర్శన చేశారు. రొయ్యల రైతులకు హ్యాచరీ అసోసియేషన్‌, ఫీడ్‌ షాప్‌ల అసోసియేషన్‌ మద్దతు పలికాయి. ధర్నాలో రొయ్యల రైతులు సంఘ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కుంతురి సుబ్బారెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు పమిడి సుబ్బానాయుడు, సంఘం సలహాదారుడు చేపల రమణయ్య, ఉపాధ్యక్షుడు సింగమనేని అంజిబాబు, సహాయ కార్యదర్శి బత్తుల రమేష్‌ రెడ్డి, నార్నె రమేష్‌, సంఘం జిల్లా నాయకులు ఉప్పలపాటి నాగరాజు, నార్ని సతీష్‌, కొంక రంగారావు, గోపాల్‌ రెడ్డి, పెద్ద ఎత్తున రొయ్యల రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement