టంగుటూరు: ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కారుమంచి, జయవరం గ్రామాల మధ్య సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారుమంచి, జయవరం గ్రామాల మధ్య ముసివాగులో ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. ఇద్దరు క్షేమంగా బయటికి వచ్చారు. వారిలో మన్నం కార్తీక్ మృతి చెందాడు. కార్తీక్ జెడ్పీ హైస్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు. ఈ విషయంపై టంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఎటువంటి కేసు నమోదు కాలేదు.
గిద్దలూరు రూరల్: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట – చలమ మధ్య నల్లమల అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న నంద్యాల జీఆర్‌పీఎఫ్ సిబ్బంది సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడేందుకే రైలు వచ్చే సమయంలో ట్రాక్ మధ్యలో ఉండటం వలనే రైలు పట్టాల మధ్యలో ఉండిపోయినట్లు రైల్వే పోలీసులు అంచనా వేశారు. రైలు ఢీకొట్టడంతో మొహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. మృతుడు పాచీ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. నంద్యాల జీఆర్‌పీఎఫ్ ఎస్సై కుమారి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


