మట్టి దొంగలు | - | Sakshi
Sakshi News home page

మట్టి దొంగలు

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

రాజుపాలెం చెరువులో గ్రావెల్‌ దోపిడీ టీడీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమ దందా

ఉలవపాడు: ‘‘నేను ఎమ్మెల్యే బంధువుని...ఈ మండలంలో పెత్తనం నాదే... గ్రావెల్‌ తరలింపు మొత్తం నాకు తెలిసి నేను తోలాల్సిందే...’’ ఇదీ ప్రస్తుతం మండలంలో ఓ నాన్‌లోకల్‌ టీడీపీ నేత పెత్తనం. దీనికి స్థానికంగా ఉన్న మరో టీడీపీ నేత సహకారంతో భారీగా గ్రావెల్‌ దోపిడీ జరుగుతోంది. ఉలవపాడు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాజుపాలెం చెరువును అడ్డాగా చేసుకుని భారీగా గ్రావెల్‌ దోపిడీ చేస్తున్నారు. రాజుపాలెం చెరువు నుంచి హైవేకు నేరుగా చేరుకునేలా రోడ్డు ఏర్పాటు చేసుకుని టిప్పర్లతో గ్రావెల్‌ తరలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చెరువులో జేసీబీలు ఏర్పాటు చేసుకుని టిప్పర్లలో నింపుకుని తరలిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 100 ట్రిప్పుల పైనే గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్న చందంగా ఇసుక, మట్టి, గ్రావెల్‌ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

అక్రమార్జన మొత్తం నాన్‌ లోకల్‌ నేత ఆధ్వర్యంలోనే...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలోని బడానేత ఉలవపాడు మండలానికి ఒక ఇన్‌చార్జ్‌ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పెత్తనం అంతా ఆయనే చేసేవాడు. ఆయన ఆధ్వర్యంలో అన్నీ నడిచేవి. ఇన్‌చార్జికి, పెద్దనేతకు మధ్య మనస్పర్ధలు రావడంతో ఇప్పుడు ఆ నేతకు బంధువుగా ఉన్న మరో నాన్‌లోకల్‌ నేత ఈ గ్రావెల్‌, మట్టి దోపిడీ, రెవెన్యూ కార్యాలయంలో పనులు అన్నీ తానై చూస్తున్నాడు. అధికారులు సైతం మట్టి, గ్రావెల్‌ ఎంత తోలుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు. ఒక్కో టిప్పర్‌ కు సదరు నాన్‌లోకల్‌ నేతకు సుమారు రూ.3 వేల ఆదాయం ఉంది. అంతే కాకుండా ఉలవపాడు బైపాస్‌లో ఉన్న సుమారు 75 ఎకరాల వెంచర్‌కు భారీగా గ్రావెల్‌ అవసరం ఉంది. దీనికి తోలడానికి ఉలవపాడు మండలంలోని చెరువుల నుంచి భారీ దోపిడీకి స్కెచ్‌ వేశారు. ఇలా మండల పరిధిలో గ్రావెల్‌, మట్టి భారీ దోపిడీ జరుగుతోంది.

నిద్రలో ఉన్న అధికారులు...

నిద్రపోతున్న వారిని లేపవచ్చు కానీ నిద్రనటిస్తున్న అధికారులను లేపడం కష్టతరంగా మారింది. ప్రస్తు తం ఉలవపాడు మండలంలో అధికారుల పరిస్థితి అలాగే ఉంది. ఈ నాన్‌లోకల్‌ నేత గ్రావెల్‌, మట్టి తోలుతుంటే, నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు కనీసం పట్టించుకోరు. ఎవరైనా ఫోన్‌ చేసినా స్పందించరు. ఆ వైపునకు రారు. ఇలా పకడ్బందీగా జరుగుతున్న గ్రావెల్‌ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement