ఉలవపాడు: మండల కేంద్రం ఉలవపాడుకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడి కుమారుడు, టీడీపీ నాయకునిగా చెలామణీ అవుతున్న రాచగల్ల శివప్రసాద్ ఉపాధి కూలీలపై శనివారం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన చేష్టలకు కూలీలు తిరగబడ్డారు. వివరాలు.. ఉలవపాడు దర్గా సెంటర్‌కు చెందిన 15 మంది కూలీలు రోజూ ఉపాధి పనులకు వెళ్తున్నారు. శనివారం ఉదయం కూడా పనులకు వెళ్తున్న సమయంలో సదరు టీడీపీ నాయకుడు కూలీలు వెళ్తున్న ఆటోను ఆపి మీరు కరువు పనికి రావద్దని వారితో వాగ్వాదానికి దిగాడు. మీరు పనికి వెళ్తే మిగిలిన వారికి కూడా మష్టర్ వేయనని బెదిరించాడు. అదే సమయంలో మేట్‌కు ఫోన్ చేసి ఆ 15 మంది కూలీలకు మష్టర్ వేయవద్దని హుకుం జారీ చేశాడు. అయినా ఆ కూలీలు పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. మీకు హాజరు వేయలేనని మేట్ స్పష్టం చేశాడు. మిగిలిన కూలీలు కూడా ఆ 15 మంది కూలీలకు మీరు పనులకు రావొద్దని చెప్పారు. దీంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చారు. రెండో శనివారం కావడంతో కార్యాలయం మూత వేసి ఉంది. అక్కడకు వచ్చిన సదరు టీడీపీ నాయకుడిని ఇలా ఎందుకు చేస్తున్నావని నిలదీయడంతో అందరూ గుమిగూడారు. టీడీపీ నాయకులకు తమ ఉపాధి పనిపై పెత్తనం ఏంటని తిరగబడ్డారు. 15 మంది కూలీల్లో కూడా అధిక శాతం మంది టీడీపీ సానుభూతిపరులు కావడం విశేషం. కూటమి నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజలు తిరగబడుతున్న పరిస్థితి మండలంలో నెలకొంది. అంతేకాకుండా ఫొటోలు తీస్తున్న కొందరు పత్రికా విలేకరులపై కూడా సదరు టీడీపీ నేత చిందులు తొక్కడం గమనార్హం.
తారు రోడ్డుపై మట్టి పోయడంపై విమర్శలు
మరో వైపు ఉపాధి హామీ పథకం కింద జాతీయ రహదారి నుంచి వీరేపల్లి మీదుగా పాజర్ల వెళ్లే తారు రోడ్డుపై ఉపాధి కూలీలతో మట్టి పోసి గుంతలు పూడ్చడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. పంచాయితీరాజ్ ఽఆధ్వర్యంలో ఉన్న తారు రోడ్డుపై ఉపాధి పనులు ఎందుకు చేయిస్తున్నారో తెలియదు. పక్కనే ఉన్న మట్టి ఎత్తి పోసి మష్టర్లు వేస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంఽధించి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి పోసి ఉపాధి కూలీలకు మష్టర్లు వేస్తున్నారు. ఈ రోడ్డుకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదని, తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని పీఆర్ ఏఈ రమణమూర్తి చెప్పడం గమనార్హం.
తిరగబడిన ఉపాధి కూలీలు


