ఉలవపాడు: సెల్ఫీ సరదా.. ఆ యువకుడి పాలిట మృత్యుపాశమైంది. సరదాగా ఫొటోలు దిగుదామని నీటిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యువకుడు.. ప్రమాదవశాత్తూ చెరువులోని లోతైన గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన ఉలవపాడు మండలం రాజుపాలెం చెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శోభిత్(23) జాతీయ రహదారి భద్రతా వాహనం సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం తన తోటి సిబ్బందితో కలిసి టంగుటూరు నుంచి వాహనాన్ని తనిఖీ చేసుకుంటూ రాజుపాలెం వద్దకు వచ్చారు. అక్కడ జాతీయ రహదారి పక్కనే ఉన్న చెరువును చూసి, సరదాగా ఫొటోలు దిగాలని శోభిత్ ఆశపడ్డాడు. మిత్రులకు ఫోన్ ఇచ్చి ఫొటోలు తీయమన్నాడు. ఈ క్రమంలో నీటిలో ముందడుగు వేసిన ఆయన, అక్కడ అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన భారీ గుంతను గమనించలేకపోయాడు. ఒక్కసారిగా అడుగు లోపలికి పడటంతో నీటిలో మునిగిపోయాడు. అది చూసి నిర్ఘాంతపోయిన తోటి మిత్రులు.. వెంటనే హైవే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి గజఈతగాళ్లను రప్పించి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే శోభిత్ గ్రావెల్ మట్టిలో కూరుకుపోయి శ్వాస ఆడక మృతి చెందాడు. ఈతగాళ్లు శ్రమించి ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. శోభిత్ మృతికి రాజుపాలెం చెరువులో అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన గోతులే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు టౌన్: గంజాయి తరలిస్తున్న ఒక పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకుని భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడాన్ని కట్టడి చేయడంలో భాగంగా ఒంగోలు టూటౌన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుళ్లు ఇద్దరు శుక్రవారం సాయంత్రం నగరంలోని బాలాజీ నగర్ పరిసరాలకు వెళ్లారు. అదే సమయంలో నగరానికి చెందిన ముగ్గురు యువకులు ఒడిశా నుంచి పూరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తీసుకొచ్చి ఒంగోలు రైల్వేస్టేషన్‌లో రైలు దిగారు. ప్రధాన గేటు వైపు రైలు దిగితే పోలీసు ఉంటారని భావించి కొత్తగా నిర్మించిన 5వ నంబర్ ప్లాట్‌ఫాం వైపు దిగి బాలాజీ నగర్ వైపు వెళ్లారు. అక్కడు పోలీసులకు అనుమానం రావడంతో వారిని వెంబడించారు. వారిలో ఇద్దరు యువకులు భయపడి పరారయ్యారు. మన్నెం భవానీ ప్రకాష్ అనే నిందితుడు పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుంచి 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తాలూకా పోలీసులకు అప్పగించారు. నగరానికి చెందిన ఒక గిరిజన యువకుడిని నగర శివారుకు తీసుకెళ్లి చితకబాది మొహం మీద మూత్రం పోసిన కేసులో ప్రధాన నిందితుడైన మన్నెం రామాంజనేయులు, అతని తమ్ముడు భవానీ ప్రకాష్‌లు సుధీర్ అనే యువకుడితో కలిసి ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆ మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.


