ప్రభుత్వ స్థలం ఆక్రమణకు యత్నం
2.51 ఎకరాల్లోని రూ.60 లక్షల విలువైన డొంక పోరంబోకు భూమి ఆక్రమణ అక్రమ నిర్మాణాలకు యత్నించిన శానంపూడి టీడీపీ నాయకుడు అడ్డుకున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు
సింగరాయకొండ: ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించేయటం.. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారింది. ఈ క్రమంలో మండలంలోని శానంపూడి గ్రామ పంచాయతీ శివారులోని సర్వే నంబరు 447 లోని సుమారు రూ.60 లక్షల విలువైన 2.51 ఎకరాల భూమిపై ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుని కన్ను పడింది. దీంతో ఈ భూమి పై నకిలీ పత్రాలు సృష్టించి అందులో అక్రమ కట్టడాలు నిర్మించే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావటంతో అప్రమత్తమైన రెవెన్యూ, పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తహశీల్దార్ రాజేష్ సిబ్బందిని పంపి ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పనులు ఆపగా, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి సాంబశివరావు ఇది ప్రభుత్వ స్థలమని ఇందులో అక్రమ కట్టడాలు నిషేధమని బోర్డు ఏర్పాటు చేశారు. కానీ బోర్డు ఏర్పాటు చేసిన కొద్ది సేపటికే సదరు ఆక్రమణదారుడు బోర్డు తొలగించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ భూమిని అప్పటి తహశీల్దార్ ఉషారాణి జగనన్న కాలనీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ భూమిపై తనకు అసైన్‌మెంటు పట్టా ఉందని హైకోర్డు ను ఆశ్రయించి జగనన్న కాలనీకి కేటాయించకుండా ఆపుకున్నాడు. ఆ స్థలంలో జామాయిల్ సాగవుతోంది. తరువాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో జామాయిల్ కొట్టుకుని లబ్ధిపొందాడని ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ విలువైన భూమిలో అక్రమ నిర్మాణాలు కడుతున్నాడని, దీనిపై పంచాయతీ సెక్రటరీ ప్రభుత్వ స్థలమని బోర్డు కూడా ఏర్పాటు చేశాడని వివరించారు. దీనిపై తహశీల్దార్ రాజేష్‌ను వివరణ కోరగా ఈ స్థలం డొంక పోరంబోకు భూమి అని, ఈ భూమిపై ఎవరికీ పట్టాలు ఇవ్వరని ఇందులో అక్రమ కట్టడాలు కడుతుంటే ఆపామన్నారు. సదరు వ్యక్తి ఈ భూమిపై గతంలో హైకోర్టును ఆశ్రయించాడని, కోర్టు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూస్తామన్నారు.
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు యత్నం


