వెలిగొండపై అసత్య ప్రచారాలొద్దు | - | Sakshi
Sakshi News home page

వెలిగొండపై అసత్య ప్రచారాలొద్దు

Dec 17 2025 10:03 AM | Updated on Dec 17 2025 10:03 AM

వెలిగొండపై అసత్య ప్రచారాలొద్దు

వెలిగొండపై అసత్య ప్రచారాలొద్దు

ప్రాజెక్టులో చంద్రబాబు పాత్రపై శ్వేతపత్రం ఇవ్వండి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ డిమాండ్‌

యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ నాయకులు అసత్యప్రచారాలు చేస్తున్నారని, వారికి దమ్ముంటే ప్రాజెక్ట్‌పై చంద్రబాబు పాత్ర గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పదే పదే వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించడం, వైఎస్సార్‌ సీపీపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిమ్మల రామానాయుడు విమర్శల కోసం వెలిగొండ ప్రాజెక్ట్‌ను వినియోగించుకోవడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రాజెక్ట్‌ గత చరిత్ర ఏమిటో ఒక సారి నెమరువేసుకోవాలని ఆయన హితవు పలికారు. 1996లో వెలిగొండ ప్రాజెక్ట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేసే సమయంలో పర్మిషన్లులేవని, భూసేకరణ, పునరావాసంపై ఆలోచనకానీ లేదని ఆయన అన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌కు కొబ్బరికాయకొట్టిన బాబుకు టన్నెల్‌ పనులు దాదాపు పూర్తిచేసిన వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే హక్కు ఏమాత్రం లేదని అన్నారు.

1980 నుంచే ప్రాజెక్టు ప్రతిపాదనలు:

వెలిగొండ ప్రాజెక్ట్‌ టన్నెల్‌ ద్వారా కృష్ణానది బ్యాక్‌ వాటర్‌ను తరలించాలనే ప్రతిపాదనలు 1980 నుంచే ఉన్నాయని, అప్పటికి టీడీపీ పుట్టనేలేదని, అంటే టీడీపీ పాత్ర వెలిగొండ ప్రాజెక్ట్‌లో లేదని స్పష్టంగా అర్థమవుతోందని తాటిపర్తి అన్నారు. ఆ పార్టీ ఉనికేలేనప్పటి నుంచి వినిపిస్తున్న వెలిగొండకు తొలిసారి 1991లో కృష్ణానది జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నల్లమల కొండ ప్రాంతానికి టన్నెల్‌ ద్వారా తీసుకొని రావాలని నిర్ణయించారని వివరించారు. 1994లో సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికను అధికారులు సిద్ధం చేసి ప్రాజెక్ట్‌ సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేసి అంకురార్పణ చేశారన్నారు. టీడీపీని విజయవంతంగా లాగేసుకున్న బాబు ఆర్భాటాల కోసం 1996 మార్చి 5న శంకుస్థాపనచేసి ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యంగా వదలేశారని విమర్శించారు. ఈ అంశాన్ని కాగ్‌ రిపోర్ట్‌ 4/2023లో పేజీ నంబర్‌ 15 నుంచి 22 పేజీల వరకు ప్రాజెక్ట్‌ను చంద్రబాబు శంకుస్థాపన చేశారే తప్ప 2004 వరకు ఎటువంటి ప్రధాన అడుగులు పడలేదని, ఎటువంటి పనులు చేపట్టలేదన్న విషయాన్ని స్పష్టంగా పొందుపరిచిందని అన్నారు.

వైఎస్సార్‌ హయాంలోనే ముందడుగు..

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్‌ 27న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిజమైన పునాదిరాయి వేశారని, అన్ని పర్యావరణ అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులు వచ్చేలా కృషి చేశారని, రైతుల నుంచి భూములు సేకరించి వారికి చెల్లింపులు చేశారన్నారు. రూ.3500 కోట్లు ఖర్చుపెట్టి దాదాపు 70 శాతం పనులు జరిగిన తరువాత తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ప్రాజెక్ట్‌పై సవతి ప్రేమ చూపించారని అన్నారు. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 2 టన్నెల్స్‌, కొండల నడుమ గ్యాప్‌లను పూర్తి చేశారని, కరోనా మహమ్మరి విజృంభిస్తున్నా ప్రాజెక్ట్‌పై ఆయన సంపూర్ణ శ్రద్ధ వహించి నిర్మాణాలు పూర్తి చేసి జాతికి అంకితం చేశారన్నారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 11 పునరావాస గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి ఆ ప్రాజెక్ట్‌ ద్వారా కృష్ణా జలాలు మళ్లిస్తామని జగన్‌మోహన్‌రెడ్డి అప్పట్లోనే చెప్పారని అన్నారు.

మంత్రి నిమ్మల అసత్య ప్రచారం..

మంత్రి నిమ్మల వెలిగొండపై అసత్య ప్రచారం చేస్తూ దాదాపు రెండేళ్ల నుంచి 8 పునరావాస కాలనీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు కానీ, టీ5 కాలువ పనులు చేపట్టలేకపోయారని విమర్శించారు. రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, అందులో కేవలం రూ.100 కోట్లు కూడా ఖర్చుచేయని ఈ ప్రభుత్వం 2026లో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్తున్నారన్నారు. ఏదో పనులు చేయిస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టేందుకు పదే పదే వెలిగొండ ప్రాజెక్ట్‌ను మంత్రి విజిట్‌ చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ కాలంలో పూర్తయిన పనులు తమ ఖాతాల్లో వేసుకొని తామే చేయిస్తున్నామని కలరింగ్‌ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని, వెలిగొండను బాధ్యతగా పూర్తిచేయాలని ఆయన హితవుపలికారు. సమావేశంలో ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్‌, పార్టీ మండల కన్వీనర్‌ ఏకుల ముసలారెడ్డి, వైఎస్సార్‌ సీపీ వివిధ విభాగాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement