సహకార శాఖలో రిటైర్మెంట్ వయసు పెంచాలి
జీతం రూ.26 వేలకు తగ్గకుండా ఇవ్వాలి సమస్యలు పరిష్కరించకుంటే 22న ధర్నా ఈ నెల 29న చలో విజయవాడ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు
ఒంగోలు సబర్బన్: సహకార శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 62 ఏళ్లకు పెంచాలని సహకార శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు తక్కువ కాకుండా చేసి అమలు పర్చాలన్నారు. జీతభత్యాల్లో కోత విధించడం సరైనది కాదన్నారు. ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, కనీస వేతనం డిమాండ్ ప్రకారం రూ.26 వేలకు తగ్గకుండా ప్రతి ఉద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాకి జేఏసీ నాయకులు, సహకార సంఘం ఉద్యోగుల సంఘం సీఐటీయూ అనుబంధ సంఘ జిల్లా అధ్యక్షుడు వీ మనోజ్ కుమార్ అధ్యక్షత వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార రంగానికి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సహకార సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోవాలని ప్రయత్నాల వేగవంతం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పెద్దల నిర్ణయానికి తలవంచి సహకార సంఘాలను దాని స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయటానికి పూనుకోవటం అత్యంత దారుణమన్నారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కాకపోతే ఈనెల 22వ తేదీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల(పీడీసీసీ) ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే 29వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే జనవరి 5 నుంచి ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ సత్య శివశంకర్, ప్రధాన కార్యదర్శి జీ రామాంజనేయరెడ్డి, కోశాధికారి కార్తీక్ రెడ్డి, రామిరెడ్డి, కృష్ణ చైతన్య, వీరబ్రహ్మం, రమణారెడ్డి, రమేష్, శ్రీనివాసరావు, రంగయ్య, బాలాజీ, ప్రసాదు, అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పవన్ కుమార్, సందీప్, రాజేషు తదితరులు జిల్లా నలుమూలల నుంచి సొసైటీ సభ్యులందరూ పాల్గొన్నారు.


