రాజ్యాంగేతర శక్తిగా లోకేష్
ఇండిగో అంశమే నిదర్శనం పత్తాలేని విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు లోకేష్ జోక్యంపై సర్వత్రా విమర్శలు మంత్రులు నారా లోకేష్, రామ్మోహన్‌నాయుడు తక్షణం రాజీనామా చేయాలి మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్
సింగరాయకొండ: రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారాలోకేష్ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడనటానికి ఇండిగో సంక్షోభంలో జోక్యం చేసుకోవటమే నిదర్శనమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిత్వ శాఖకు సంబంధించి అంశం పరిష్కారానికి కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజవరపు రామ్మోహన్‌నాయుడు ఉన్నాడన్నారు. ఇండిగో సమస్య పరిష్కారానికి రామ్మోహన్‌నాయుడు సమీక్ష నిర్వహించాల్సి ఉండగా నారాలోకేష్ సమీక్ష చేయటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారాడనటానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలన్నారు. లోకేష్ విద్యాశాఖ తప్ప మిగతా అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపించారు. విమాన సర్వీసులను, అందులో పనిచేసే సిబ్బందికి పనిచేసే రోస్టర్‌ను అమలు చేయించటంలో డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. విమానాయాన సంస్థల్లో పనిచేసే సిబ్బంది శ్రమ దోపిడీని నివారించేందుకు నిబంధనలు విధించిందన్నారు. కానీ ఆరురోజులుగా ఇండిగో సంస్థ గందరగోళం సృష్టిస్తే సమస్య పరిష్కారానికి సమీక్షలు నిర్వహించాల్సిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. ఇండిగో విమానయాన సంస్థతో చర్చలు లేవని, దానిపై చర్యలు కూడా లేవన్నారు. దేశంలో లక్షలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని దీంతో ఎయిర్‌పోర్టులు ఆర్‌టీసీ బస్టాండులు, రైల్వేస్టేషన్లుగా మారాయన్నారు. ఇది పూర్తిగా కేంద్రమంత్రి వైఫల్యమని, ఈ వ్యవహారంలో నారాలోకేష్ మితిమీరిన జోక్యానికి నిదర్శనమన్నారు. తక్షణమే మంత్రులు నారాలోకేష్, రామ్మోహన్‌నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పరకామణి అంశంతో డైవర్షన్ రాజకీయం:
ఇండిగో సమస్యను పక్కదారి పట్టించేందుకు పరకామణి అంశాన్ని టీడీపీ నాయకులు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. పరకామణి అంశంలో జగనన్న మాటలను టీడీపీ నాయకులు పూర్తిగా వక్రీకరించారని విమర్శించారు. పరకామణి వ్యవహారంలో దోషిగా ఉన్న రవికుమార్ చేసింది ఘోర అపచారమని జగనన్న అన్నాడని, కానీ చేసిన దొంగతనం మాత్రం చిన్నదని అన్నాడన్నారు. వాస్తవానికి రవికుమార్ 100 డాలర్ల నోట్లు 9 దొంగిలించాడని వాటి విలువ సుమారు రూ.72 వేలు కాగా ఆయన తాను అపచారానికి ప్రాయశ్చిత్తంగా స్వామి వారికి రూ.14 కోట్లు విలువైన ఆస్తులు రాసిచ్చాడన్నారు. ఈ అంశాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేయటం సమంజసం కాదని హితవు పలికారు.


