
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం వాసి దుర్మరణం
మదనపల్లె రూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి దుర్మరణం చెందిన ఘటన శనివారం కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు సమీపంలో జరిగింది. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లె పంచాయతీ ముర్గాని గ్రామానికి చెందిన ఎరుకులయ్య కుమారుడు పెద్దిరెడ్డి గారి పేరారెడ్డి (32) ద్విచక్ర వాహనంపై మదనపల్లె మీదుగా బెంగళూరు వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యంలోని కర్ణాటక సరిహద్దు రాయల్పాడు వద్ద ఎదురుగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పేరారెడ్డిని స్థానికుల సాయంతో రాయల్పాడు పోలీసులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుడి జేబులోని ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాయల్పాడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ప్రకాశం వాసి దుర్మరణం