
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు వన్‌టౌన్: కౌలు రైతులకు నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్‌సీ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో వీడియో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్స్, హౌసింగ్ ఫర్ ఆల్‌లో భాగంగా ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్, నూతన ఇంటి పట్టాల కోసం దరఖాస్తుల పరిశీలన, జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారం రెగ్యులరైజేషన్, రీ సర్వే ప్రక్రియ, రేషన్ షాపుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో 46,015 మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 11,579 మంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలన్నారు. కోర్టు కేసులను ఆన్‌లైన్‌లో చూసుకునేలా రెవెన్యూ కేసులు కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జీఓ ఎంఎస్ 30 ప్రకారం రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 22ఏ డాటెడ్ ల్యాండ్, భూమి అప్పగింత, అసైన్‌మెంట్ ల్యాండ్‌లకు సంబంధించి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్‌డీసీలు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, జిల్లా వ్యవసాయ అధికారులు శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ పెరుగు శ్రీనివాస ప్రసాద్, డీఎస్‌ఓ పద్మశ్రీ,, సివిల్ సప్‌లైస్ డీఎం వరలక్ష్మి, జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, రెవెన్యూ డివిజినల్ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.