అధికార జలగలు ! | - | Sakshi
Sakshi News home page

అధికార జలగలు !

Jul 2 2025 7:03 AM | Updated on Jul 2 2025 7:03 AM

అధికా

అధికార జలగలు !

దోపిడీకి నోటీసులు..

ఒంగోలు నగరపాలక సంస్థ వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా తయారైంది. చిరు వ్యాపారం చేసుకునే కూరగాయల నిర్వాహకులపై బకాయిలను వడ్డీల రూపంలో మోయలేని భారాన్ని మోపుతున్నారు.

నగర పాలక సంస్థ ఇచ్చిన నోటీసులు చూసి వ్యాపారుల కళ్లు బైర్లు కమ్మాయి.

చెల్లించాల్సింది రూ.5.78 కోట్లు అయితే వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీ కలిపి రూ.7.08 కోట్లు వేశారు. మొత్తంగా రూ.12.86

కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అధికారులిచ్చిన నోటీసులు చూసి వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేంటి అని అడిగిన వారి దుకాణాలను సీజ్‌ చేస్తున్నారు. అధికారులు చిరు వ్యాపారులను జలగల్లా పీక్కుతింటున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు

వెల్లువెత్తుతున్నాయి.

సాక్షిప్రతినిధి, ఒంగోలు:

గరంలో కొత్త కూరగాయల మార్కెట్‌ వ్యాపారులు అధికారులు, పాలకుల మధ్య నలిగిపోయి..చిక్కి శల్యమవుతున్నారు. ఒక పక్క బాడుగల పేరుతో వేధింపులు...మరోపక్క దుకాణాలు పెట్టుకోనీయకుండా బెదిరింపులు అక్కడి వ్యాపారులకు నిత్యకృత్యమయ్యాయి. కొత్త కూరగాయల మార్కెట్‌ ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు దోచుకునేందుకు సొంత ఆదాయ వనరుగా మారిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌ (ఏఎంసీ) కోసం కాంప్లెక్స్‌ నిర్మించారు. ఒంగోలు నడిబొడ్డులో కాంప్లెక్స్‌ నిర్మాణం కావటంతో అప్పటి పాలకులు ఏఎంసీకి కాకుండా కూరగాయల మార్కెట్‌ అయితే నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావించి ఏఎంసీని పాత గుంటూరు రోడ్డుకు తరలించి ఆ కాంప్లెక్స్‌ను ఒంగోలు మున్సిపాలిటీకి అప్పగించారు. దాంతో 2008లో పాత కూరగాయల మార్కెట్‌ నుంచి వ్యాపారులను ఇక్కడకు మార్చారు. అప్పట్లో మున్సిపాలిటీ అధికారులు అద్దెలు ఖరారు చేసి వసూలు చేయటం ప్రారంభించారు. 2008 నుంచి 2019 నవంబర్‌ వరకు వ్యాపారులు అందరూ పూర్తిగా బకాయిలు లేకుండా అద్దెలు చెల్లించారు.

కరోనా నుంచి కష్టాలు ప్రారంభం:

కరోనా సమయం నుంచి కొత్త కూరగాయల మార్కెట్‌ వ్యాపారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 2019 డిసెంబర్‌ నుంచి షాపులను నగరపాలక సంస్థ అధికారులు అప్పటి వరకు ఉన్న అద్దెకు 33.33 శాతం పెంచి షాపులను వ్యాపారులకు రెన్యువల్‌ చేయాల్సి ఉంది. ఇంతలో కరోనా వచ్చింది. 2020 మార్చి నుంచి కరోనాతో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దాంతో మార్కెట్‌ మూత పడింది. అయితే మార్కెట్‌లో కాకుండా రంగారాయుడు చెరువు పక్కనే ఉన్న పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా షెడ్లు వేసి ఆ వ్యాపారుల చేతనే ఇక్కడ కూరగాయలను ప్రజల అవసరాలు తీర్చేందుకు అమ్మకాలు జరిపించారు. ఈ విధంగా రెండేళ్ల పాటు చేయించారు. అయితే కరోనా సమయంలో ఉన్న అద్దె బకాయిలను మాఫీ చేయమని వ్యాపారులు పాలకులను, అధికారులను అడుగుతూ వచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి మాఫీ చేయిస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. అద్దె మాత్రం మాఫీ చేయలేదు. కానీ కరోనా సమయం నుంచి నగర పాలక సంస్థ అధికారులు 193 షాపులకు అద్దెల లెక్కలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు.

రూ.5.78 కోట్లు అసలు..

వడ్డీ రూ.7.08 కోట్లు..!

ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్‌లో మొత్తం షాపులు 193 ఉన్నాయి. వాటిలో రిటైల్‌ షాపులు 123, హోల్‌ సేల్‌ షాపులు 70 ఉన్నాయి. 2019 డిసెంబరు నుంచి 2022 నవంబర్‌ వరకు మాత్రమే. 2022 డిసెంబర్‌ నుంచి రెన్యూవల్‌ చేయాల్సి ఉంది. అప్పటి వరకూ కట్టాల్సిన అద్దె బకాయిలు రూ.5.78 కోట్లు. వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్‌టీ, ఐజీఎస్‌టీలు వేసి రూ.7.08 కోట్లు ఉందంటూ నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం మొత్తం రూ.12.86 కోట్లు చెల్లిచాల్సి వస్తుంది. ఈ బకాయిలు రిటైల్‌, హోల్‌సేల్‌ వ్యాపారుల పాలిట శాపాలుగా మారాయి. చివరకు మోయలేనంతగా తయారై కట్టలేని స్థితికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే 2025 నవంబర్‌తో మూడేళ్లకు గడువు ముగుస్తుంది కూడా. ఇప్పటి వరకు కట్టాల్సిన రూ.12.86 కోట్లతో పాటు అదనంగా మళ్లీ 33.33 శాతం అద్దె పెంచాలి. పెరిగిన అద్దెతో పాటు వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్‌టీలు కలుపుకొని మరో రూ.15 కోట్ల వరకు కట్టాల్సిన పరిస్థితి. అంటే మొత్తం కలుపుకుంటే రూ.27.86 కోట్లు బకాయిలు చెల్లించాలని అధికార వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేషన్‌ అధికారులు ఇస్తున్న నోటీసులు చూసిన చిరువ్యాపారులు కళ్లు తేలేస్తున్నారు. ఫైనాన్స్‌ వ్యాపారులే నయం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి 2.50 శాతం మాత్రమే వడ్డీ... కానీ 50 శాతంపైగా వసూలు...

వాస్తవానికి కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు ఇచ్చిన అగ్రిమెంట్‌ ప్రకారం అద్దె బకాయిలపై కేవలం 2.50 శాతం మాత్రమే వడ్డీ, అపరాధ రుసుం కట్టాలి. ఆ నిబంధనలు గాలికి వదిలేసిన నగర పాలక సంస్థ అధికారులు ఇష్టం వచ్చినట్లు వడ్డీ, అపరాధ రుసుం విధిస్తూ నోటీసులు పంపారు. ఇచ్చిన ఆ నోటీసులు కూడా మున్సిపల్‌ కార్యాలయంలో రికార్డు ఏమీ ఉండదు. కంప్యూటర్‌లో ఒక ప్రింట్‌ తీసుకొని ఇచ్చి మరీ డబ్బులు వసూలు చేసుకుపోయారు. గతంలో వాటికి లెక్కా..పక్కా లేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ, అపరాధ రుసుం కలుపుకొని కట్టాల్సింది 193 షాపులకు కలిపి రూ.5.78 కోట్లు అయితే (2022 నవంబర్‌ వరకు) దానికి అదనంగా వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీలు కలుపుకొని రూ.7.08 కోట్లు కట్టాలని నోటీసులు షాపులకు అతికించారు. వ్యాపారులకు చేతికి కూడా ఇవ్వటం లేదు. ఇదొక అడ్డగోలు వ్యవహారంలా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.

సొంత ఖర్చులకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొత్త కూరగాయల మార్కెట్‌ కార్పొరేషన్‌ అధికారులకు గుర్తుకు వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. బకాయిల పేరుతో పలు మార్లు కార్పొరేషన్‌ అధికారులు డబ్బులు వసూలు /చేశారు. అలా ఇప్పటి వరకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. ఏ ఒక్కరికీ రసీదులు ఇచ్చిన పాపాన పోలేదు. వసూలు చేసిన అధికారులు ఒకరిద్దరు చనిపోగా, కొందరు బదిలీపై వెళ్లారు. కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. కానీ కూరగాయల మార్కెట్‌ వ్యాపారులు కట్టిన అద్దె డబ్బులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. కొంత మంది అధికారులు సంవత్సరాల తరబడి కార్పొరేషన్‌లోనే పనిచేస్తూ వ్యాపారులపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు 2019వ సంవత్సరం నుంచి నేటికీ అదే జరుగుతుందంటే వ్యాపారుల బాధలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అందినకాడికి దోచుకుంటూ..?

కూరగాయల మార్కెట్‌ను వేధిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు

గుదిబండలా మారిన బకాయిలు

అద్దె బకాయిలు మొత్తం రూ.5.78 కోట్లు

వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీతో రూ.7.08 కోట్లు

మొత్తం రూ.12.86 కోట్లు చెల్లించాలంటూ కార్పొరేషన్‌ అధికారుల ఒత్తిడి

నిబంధనల ప్రకారం 2.50 శాతం వడ్డీ మాత్రమే

అడ్డగోలుగా 50 శాతానికి పైగా వడ్డించి వసూలు

కరోనా సమయంలో మార్కెట్‌ లేకపోయినా అద్దె కట్టాల్సిందే అంటూ వేధింపులు

ముఖం చాటేస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు

అధికార జలగలు ! 1
1/1

అధికార జలగలు !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement