
ఎండీఎం మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
మద్దిపాడు: పాఠశాలలో మెనూ ప్రకారం చిన్నారులకు భోజనం అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని గార్లపాడు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ప్రతి రోజు రుచికరంగా ఉంటుందా, సన్న బియ్యం వండుతున్నారా, భోజనం ఎలా ఉందంటూ ప్రలు ప్రశ్నలు వేసి వారి వద్ద సమాధానాలు రాబట్టారు. అనంతరం కలెక్టర్ చిన్నారులతో సహపంక్తి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతివారం ఎంపీడీఓ, తహశీల్దార్లు మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈమని శ్రీనివాసరావుతో మాట్లాడుతూ విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గార్లపాడు రేషన్ షాపును సందర్శించి సరఫరా చేసిన స్టాకు, మిగిలిన స్టాకును పరిశీలించారు. రేషన్ పంపిణీ కచ్చితంగా జరగాలని, ఎక్కడా అవకతవకలకు పాల్పడకుండా చూడాలని తహశీల్దార్ ఆదిలక్ష్మిని ఆదేశించారు. కార్యక్రమంలో వారి వెంట ఇన్‌చార్జి ఎంపీడీఓ డీఎస్‌వీ ప్రసాద్, ఎంఈఓలు ఎంవీఆర్ ఆంజనేయులు, ఎం.శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ దేవరపల్లి గంగిరెడ్డి, పలువురు ఆధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.