
నేడు ప్రైవేట్ పాఠశాలలు బంద్
ఒంగోలు సిటీ: ప్రైవేట్ యాజమాన్యాలపై అతిగా స్పందిస్తున్న కొంతమంది అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో గురువారం అన్ని ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అపుస్మ ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్, కార్యదర్శి కాట్రగడ్డ మురళీకృష్ణ, వంశీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది అధికారులు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై అతిగా స్పందించడం, పాఠశాలలపై 3 మెన్ కమిటీలు, తనిఖీలను అమలు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. కొన్ని ఏకపక్ష వార్తలు, కొంతమంది వ్యక్తుల లేఖలు, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఎప్పటికప్పుడు నోటీసులు జారీచేయటం వాటిని వెంటనే అమలు చేయమనడం, కొంతమంది ఫీల్డ్ అధికారుల నుంచి అగౌరవకరమైన సందేశాలు, హెచ్చరికలు వంటి చర్యలు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల్లో తీవ్ర వేదన కలిగిస్తున్నాయన్నారు. కొంతమంది అధికారులు తీసుకున్న అన్యాయమైన, ఏకపక్ష నిర్ణయాలతో ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలను ఆర్టీఈ 12.1.సీ దరఖాస్తుదారులను తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని బలవంతం చేయడం, పాఠశాలలను షోకాజ్ నోటీసులతో వేధించడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయనున్నట్లు తెలిపారు.
సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సిటీ: భారత ప్రభుత్వం 2025వ సంవత్సరానికి గాను జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ జాతీయ స్థాయిలో జాతీయ ఐక్యత, సమగ్రత పై అత్యుత్తమ సేవ చేసిన వ్యక్తులు, సంస్థలకు సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డు ప్రదానం చేస్తున్నట్లు స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం జిల్లాలో ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు జాతీయ ఐక్యత, సమగ్రతపై వారు చేసిన విశేష కృషిని తెలియచేస్తూ తమ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎడబ్ల్యూఆర్‌డీఎస్.జీవోవీ.ఇన్ అనే వెబ్ సైట్‌లో ఈ నెల 9వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. ఆ దరఖాస్తును, ఇతర వివరాలను ముఖ్య కార్యనిర్వహణాధికారి, స్టెప్, జిల్లా యువజన సంక్షేమశాఖ, ఒంగోలు కార్యాలయంలో 9వ తేదీలోగా మూడు కాపీలు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు కార్యాలయ పనివేళల్లో స్వయంగా కానీ లేదా ఫోన్ నంబర్ 91828 91095 ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరారు.
జాతీయ స్థాయి ఎల్‌ఎస్‌వీఎస్ శిక్షణకు విజయానంద్
సింగరాయకొండ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ ఆధ్వర్యంలో జూన్ 24, 25వ తేదీల్లో నిర్వహించిన ఎల్‌ఎస్‌వీఎస్ శిక్షణ కార్యక్రమంలో పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు డీ విజయానంద్ పాల్గొన్నారు. ఈ శిక్షణకు రాష్ట్రం నుంచి 10 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా జిల్లా ప్రతినిధిగా విజయానంద్ ప్రాతినిధ్యం వహించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో నాణ్యతా ప్రమాణాల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసే పద్ధతులపై రెండు రోజులు శిక్షణ ఇచ్చారని విజయానంద్ వివరించారు. విజయవాడకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వారు తనను నామినేటెడ్ చేశారని, శిక్షణ పూర్తి చేసిన వారికి సంస్థ డీజీఎం చిత్రాగుప్తా, డాక్టర్ ఎస్ సూర్యకళ్యాణి ధ్రువపత్రాలు అందజేశారన్నారు. ఈ శిక్షణ ద్వారా తాను నేర్చుకున్న విజ్ఞానంతో విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తానన్నారు.