
భవితకు బీటలు!
పచ్చకుట్రలు..
ఒంగోలు టిపుల్ ఐటీ రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్
భవనానికి తాళాలు వేసిన దృశ్యం
క్యాంపస్ తరలిపోదంటూ మభ్యపెట్టి..
కొత్త విద్యా సంవత్సరం నుంచి రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఉండదని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మభ్య పెట్టారు. క్యాంపస్ ఎక్కడికీ వెళ్లదంటూ చెప్పుకొచ్చారు. అధికారులతో సమావేశాలంటూ డ్రామాలకు తెరతీశారు. వారి మాటలన్నీ అబద్ధాలే అని నెల రోజుల తర్వాత స్పష్టమైంది. క్యాంపస్‌కు తాళాలు వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో సొంత భవనాలు లేకపోవడంతో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో తరగతులు నిర్వహించారు. అక్కడ ఆర్‌కే వ్యాలీ విద్యార్థులకు, ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు మధ్య తరచుగా గొడవలు జరగడం మొదలయ్యాయి. సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజం లేకుండా పోయింది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇడుపులపాయలోని ఒంగోలు క్యాంపస్‌ను నగరంలోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌కు తరలించింది. ఆ తరువాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ రావడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా చీమకుర్తి రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్‌ను లీజుకు తీసుకుంది. అప్పటి నుంచి విద్యార్థులు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు సమస్యలు మొదలయ్యాయి.
అద్దె బకాయిలు రూ.2.50 కోట్లు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌కు అద్దె చెల్లించడం నిలిపివేసింది. ఏడాది కాలానికి గాను రూ.2.50 కోట్లు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతోపాటుగా కళాశాల కరెంటు బిల్లులు చెల్లించడాన్ని పూర్తిగా నిలిపివేసింది. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తరచుగా విద్యార్థులు చీకటిలో మగ్గాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి విద్యార్థులకు కనీసావసరాలకు నీరు అందుబాటులో లేకుండా చేసింది. గత్యంతరంలేక విద్యార్థులు నాల్గవ అంతస్తు నుంచి బకెట్లలో నీళ్లు మోసుకోవాల్సి వచ్చింది. కుట్రపూరితంగానే విద్యార్థులను కష్టపెడుతూ వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. చిట్ట చివరకు కాలేజీనే ఎత్తేసింది. ప్రస్తుతం క్యాంపస్‌లోనే కళాశాలకు చెందిన సామగ్రి, విద్యార్థుల మంచాలు, బెడ్‌షీట్లతోపాటుగా ఎగ్జామ్ సెల్ కు సంబంధించిన పరికరాలు ఉండిపోయాయి. తమకు రావల్సిన బకాయిలు చెల్లించమని అడుగుతున్న భవన యజమాని కళాశాలకు తాళం వేసేశారు. దిక్కుతోచని అధికారులు కళాశాలకు చెందిన సామగ్రి, ఇతర పరికరాలకు 10 మంది సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు.
ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్ కూడా ఎత్తేస్తారా...?
చీమకుర్తి రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్ లీజు 2026 డిసెంబర్ వరకు ఉంది. నాటి ప్రభుత్వం ముందు చూపుతో ఈ క్యాంపస్‌కు అడ్వాన్స్ చెల్లించడంతో ప్రస్తుత ప్రభుత్వం అద్దెలు చెల్లించకపోయినప్పటికీ క్యాంపస్ కొనసాగుతోంది. ఈ అడ్వాన్స్ అయిపోయాక ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్‌ను కొనసాగించడం కూడా ప్రశ్నార్థకమేనని సిబ్బంది, విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్యాంపస్‌కు సైతం కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. ప్రస్తుతం రూ.2 కోట్లు వరకూ కరెంటు బిల్లు బకాయి ఉన్నట్లు సమాచారం. రావ్ అండ్ నాయుడు తరహాలో దీన్ని కూడా పూర్తిగా ఎత్తివేసేందుకు కూటమి పాలకులు కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
రాజీనామా బాటలో ఫ్యాకల్టీలు...
రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌లో 150 మంది వరకు ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. క్యాంపస్ ఎత్తివేయడంతో ఈ ఫ్యాకల్టీని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్‌లకు సర్దుబాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా అయినవారికి కంచాల్లో వడ్డిస్తున్నారు. తమకు సానుకూలంగా వ్యవహరిస్తున్న ఫ్యాకల్టీలను కోరిన చోట పోస్టింగులు ఇస్తున్నారని, మిగిలిన వారిని తమకు ఇష్టమైన చోటుకు బదిలీ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్యాంపస్ ఎత్తేయడంతో ఫ్యాకల్టీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కుటుంబ సభ్యులను తీసుకొని ఎక్కడికో వెళ్లలేక సుమారు 50 మంది ఫ్యాకల్టీలలో కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకోగా, మరికొందరు రాజీనామా చేసినట్లు తెలిసింది. మరో 40 మంది బదిలీల విషయంలో వెసులుబాటు కల్పించాలని డైరక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు సమాచారం. దీంతో అధ్యాపకుల కొరత ఏర్పడింది.
నిన్నటి దాకా వేలాది మంది విద్యార్థులతో కళకళ నేడు నిర్మానుష్యంగా రావ్ అండ్ నాయుడు క్యాంపస్ అద్దె బకాయిలు రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో క్యాంపస్‌కు తాళం వేసిన భవన యజమాని కరెంటు బిల్లులు కోటి రూపాయలకు పైగా బకాయి విద్యార్థులు, ఫ్యాకల్టీలతో మూడు ముక్కలాట తర్వాత ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్ వంతు మభ్యపెట్టిన అధికార టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు
నిర్మానుష్యంగా ఉన్న రావ్ అండ్ నాయుడు కాలేజీలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్

భవితకు బీటలు!