
వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు పట్టవా
టంగుటూరు: వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టవా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే వీరారెడ్డి అన్నారు. స్థానిక వేలం కేంద్రం నిర్వహణాధికారి శ్రీనివాసరావుకు పొగాకు రైతుల సమస్యలపై బుధవారం వినతి పత్రం అందించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రైతులు పండించిన ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని అన్నారు. రైతులు పండించిన పొగాకు గతంలో క్వింటా రూ.36 వేలు పలికినా నేడు రూ.28 వేలు కూడా ఇవ్వటం లేదన్నారు. వ్యాపారుల సిండికేట్ ముసుగులో రైతులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం నష్టాల నుంచి కాపాడాలని కోరారు. రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని తెలిపారు. రైతులు తెచ్చిన పొగాకును వెనక్కి తీసుకెళ్లకుండా పొగాకు వేలం కేంద్రం అధికారులు చూడాలన్నారు. పొగాకు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతుల పొగాకును గిట్టుబాటు ధరలకు కొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి పొగాకు రైతుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని వేలం నిర్వహణ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మి, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ప్రభాకర్, రైతు నాయకులు జీ ప్రసాద్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, కిరణ్, కోటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.