
ఓటు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలి
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కు లేని వారు తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలని ఒంగోలు ఆర్‌డీఓ కే.లక్ష్మీ ప్రసన్న చెప్పారు. స్థానిక ఆర్‌డీఓ కార్యాలయంలో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు వెంటనే ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారి ఓట్లు తొలగిస్తామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఓటర్ల జాబితా ఎటువంటి తప్పులు లేకుండా సరిచేస్తామని, చనిపోయిన వారి ఓట్లను తొలిగించాలని అధికారులను కోరారు. పోలింగ్ బూత్‌లలో సౌకర్యాలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. సలహాలు సూచనలను పార్టీల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో ఆధార్ అనుసంధానం ఎంత శాతం జరిగిందని, ఆధార్ అనుసంధానం చేసుకోని వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని అడిగారు. ఒంగోలు నగరంలో డోర్ నంబర్ల సమస్య ఉందని, నగరంలోని అన్ని డివిజన్లలో డోర్ నంబర్లు లేవని, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి పెద్ద సమస్యగా ఉందని, వెంటనే ఒంగోలు నగరంలో డోర్ నంబర్లు వేయించాలని కోరారు. గత రాజకీయ పార్టీల సమావేశాల్లో ఒంగోలు నగరంలో డోర్ నంబర్లు వేయిస్తామని డీఆర్‌ఓతో పాటు ఇతర రెవెన్యూ, నగర పాలక సంస్థ అధికారులు హామీ ఇచ్చారని, ఆ పని ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. చనిపోయిన వారి ఓట్లు వెంటనే తొలిగించాలని, నగరంలో కొన్ని పోలింగ్ స్టేషన్ల ప్రైవేటు స్కూల్స్‌లో ఉన్నాయని, ఆయా స్కూల్ యాజమాన్యాలు వాటిని తొలగించాలని కోరుతున్నాయని, ఎన్నికల కమిషన్ ఆలోచించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌కు రిపోర్ట్ చేయాలని దామరాజు క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.