
జిల్లా హామీ అమలు చేశాకే పవన్ మార్కాపురంలో అడుగు పెట్ట
● వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి
పెద్దదోర్నాల: మార్కాపురాన్ని జిల్లా చేస్తామన్న హామీని అమలు చేసిన తర్వాతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చిమ ప్రకాశంలో అడుగు పెట్టాలని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పవన్ మార్కాపురం పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్కాపురాన్ని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆ హామీ ఊసే లేదని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్వ స్థితిలోనే ఉన్నాయని, ప్రాజెక్టుకు నీరు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టకుండా ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మార్కాపురం: ఈనెల 4వ తేదీన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మార్కాపురంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం ఆమె మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ త్రివినాగ్‌తో కలిసి డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కింద 18 మండలాల ప్రజలకు తాగునీరు అందించే పథకానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. హెలీప్యాడ్, సభావేదిక వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమీవేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన ఇన్‌చార్జి ఇమ్మడి కాశినాఽథ్, డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం వర్కింగ్
ప్రెసిడెంట్‌గా చిట్యాల
హనుమంతునిపాడు: వైఎస్సార్ సీపీ రాష్‌ట్ర ఐటీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్యాల విజయ్‌భాస్కర్‌రెడ్డి ఎంపికయ్యారు. హనుమంతునిపాడు మండలం పెద్దగోళ్లపల్లి గ్రామానికి చెందిన విజయభాస్కర్‌రెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
7న బోయలపల్లెలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
యర్రగొండపాలెం: మండలంలోని బోయలపల్లె గ్రామంలో వెలసిన ఆత్మానంద అవధూత స్వాముల వారి ఆలయ 56వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ రాష్ట్ర స్థాయి పాలపండ్ల ఎడ్ల (6 పండ్ల సైజులోపు) పందేలు నిర్వహించనున్నట్లు ఆ స్వామి సేవా సంఘం బుధవారం తెలిపింది. ఈ పందేల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 1 నుంచి 5 బహుమతులు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.20 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందిస్తారని చెప్పారు. ఈ పందేల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాల కోసం సంఘ అధ్యక్షుడు మన్నెం ఆంజనేయులు, సెల్ నంబర్: 94415 86783కు సంప్రదించాలన్నారు.

జిల్లా హామీ అమలు చేశాకే పవన్ మార్కాపురంలో అడుగు పెట్ట