దాణా సొమ్ము మేశారు! | - | Sakshi
Sakshi News home page

దాణా సొమ్ము మేశారు!

Jul 3 2025 4:50 AM | Updated on Jul 3 2025 4:50 AM

దాణా

దాణా సొమ్ము మేశారు!

మర్రిపూడి: రాయితీపై ప్రభుత్వం అందించే పశువుల దాణా కోసం నగదు చెల్లించిన పశుపోషకులను ఆ శాఖ సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. పశువైద్యశాలలో దాణా నిల్వ ఉన్నా నగదు చెల్లించిన వారికి పంపిణీ చేయకపోవడంతో పశుపోషకులు ఆగ్రహించారు. బుధవారం మర్రిపూడి పశువైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. దాణా పేరుతో వసూలు చేసిన సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మర్రిపూడి మండలంలోని కాకర్ల, మర్రిపూడి గ్రామాల్లో రెండు పశువైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, ఎద్దులు 1570, గేదెలు 18,240, మేకలు 61,200, గొర్రెలు 16200 ఉన్నాయి. కాగా మర్రిపూడి పశు వైద్యశాలలో లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ ఖాజావలి, అటెండర్‌ సురేష్‌ పశుపోషకుల వద్ద రూ.555 విలువ చేసే 50 కిలోల పెల్లెట్‌ దాణా బస్తాకు రూ.600 చొప్పున వసూలు చేశారు. ఇద్దరు ధైర్యంగా పశువైద్యశాలలోనే మద్యం సేవించడం, అక్కడే పడుకోవడం, ఉన్నతాధికారులను సైతం లెక్క చేయకపోవడం గమనార్హం. రెండు నెలల క్రితం వల్లాయపాలెం, మర్రిపూడి, రాజుపాలెం, దుగ్గిరెడ్డిపాలెం, గంగపాలెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 200 మంది పశుపోషకుల వద్ద సుమారు రూ.1.20 లక్షలు వసూలు చేసి ఇప్పటికీ దాణా ఇవ్వకపోవడంతో పశుపోషకులు రోజూ ఆస్పత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రెండు రోజుల క్రితం మర్రిపూడి వైద్యశాలలకు 44 బస్తాల దాణా వచ్చిన విషయం తెలుసుకున్న పశుపోషకులు బుధవారం ఆందోళన చేపట్టారు. దాణా పంపిణీ చేసే వరకు కదలబోమని భీష్మించారు. ఆస్పత్రిలో పరిస్థితి తెలుసుకున్న ఖాజావలి బుధవారం వైద్యశాలకు రాకపోగా, అటెండర్‌ సురేష్‌ స్టాక్‌ రూమ్‌కు తాళం వేసి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం రైతులు రోజంతా గాలించారు. ఉదయం విధులకు హాజరైన పశు వైద్యాధికారి మంచాల మణిశేఖర్‌ ఆందోళనకు దిగిన పశుపోషకులను చూసి విస్తుపోయారు. ‘నేను వారం రోజుల క్రితం బాధ్యతలు చేపట్టాను. మీరు డబ్బు చెల్లించిన విషయం నాకు తెలియదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా’ అని చెప్పడంతో రైతులు శాంతించారు.

మర్రిపూడిలో పశువుల దాణా పేరుతో బస్తాకు రూ.600 చొప్పున వసూలు

దాణా నిల్వ ఉన్నా పంపిణీ చేయకపోవడంపై అనుమానాలు

200 మంది రైతులు చెల్లించిన రూ.1.20 లక్షలు సొంత ఖాతాల్లోకి!

రైతులు నిలదీయడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న నూతన పశువైద్యాధికారి

దాణా సొమ్ము మేశారు! 1
1/1

దాణా సొమ్ము మేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement