సోనాబోట్ల విధ్వంసం
● తీరానికి సమీపంలో
వేట సాగిస్తున్న మర బోట్లు
● తెగిపోతున్న వలలు
● భారీగా
నష్టపోతున్న
మత్స్యకారులు
సింగరాయకొండ: తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్లు విచ్చలవిడిగా వేట సాగిస్తున్నాయి. సింగరాయకొండ మండలంలోని పాకల, ఊళ్లపాలెంలో సముద్ర తీరానికి సమీపంలో యథేచ్ఛగా వేట సాగిస్తుండటంతో స్థానిక మత్స్యకారులు లక్షలాది రూపాయల విలువైన వలలు నష్టపోతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇటీవల కాలంలో రాత్రీ పగలు తేడాలేకుండా సోనాబోట్లు తీరానికి సమీపంలో వేటాడుతున్నాయి. మత్స్యకారులు చేపల కోసం సముద్రంలో వేసి ఉంచిన వలలను సోనా బోట్లు తెంచేశాయి. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎవరికి మొరపెట్టుకోవాలో అంతుపట్టడం లేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండు రోజుల్లో సుమారు లక్ష రూపాయలకు పైగా విలువైన వలలు నష్టపోయామని, చేపలు కూడా చిక్కడం లేదని మత్స్యకారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సోనాబోట్లు తీరానికి దూరంగా వేట సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రూ.50 వేలు నష్టపోయా
మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లా. పులసరకం వల వదిలి తిరిగి రాత్రి ఒంటి గంట సమయంలో వద్దామని నిర్ణయించుకున్నా. ఈలోగా సుమారు రాత్రి 11 గంటల సమయంలో సోనాబోటు తీరానికి దగ్గరగా చేపల వేట చేయటంతో వల తెగిపోయింది. దీంతో సుమారు 50 వేల రూపాయల వల నష్టపోయా.
– సంఖ్యా సుబ్బారావు, ఊళ్లపాలెం
వల కొట్టుకుపోయింది
సముద్రంలో చేపల కోసం మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో వేటకు వెళ్లా. ఎమ్‌ఎమ్ రకం వలను వదిలి సుమారు 11 గంటల సమయంలో తిరిగి వద్దామనుకున్నా. కానీ 10 గంటల సమయంలో సోనాబోట్ల కారణంగా నా వల తెగిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది. మిగిలిన వలను ఒడ్డుకు చేర్చుకుని బాగు చేసుకుంటున్నా. సుమారు 20 వేల రూపాయల వల నష్టపోయా.
– వల్లభుని నాగరాజు, మత్స్యకారుడు, ఊళ్లపాలెం
రూ.10 వేల వల తెగిపోయింది
సముద్రంలో చేపల కోసం గురువారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో చేపల వేటకు వెళ్లి ఎంఎం రకం వల వదిలి విశ్రమించా. తరువాత సుమారు 4 గంటల సమయంలో సోనాబోటు నా వలను ధ్వంసం చేసింది. దీంతో 10 వేల రూపాయల వల నష్టపోయా.
– సైకం మధు, దేవలం పల్లెపాలెం, ఊళ్లపాలెం
సముద్రంలో చేపల వేటకు బుధవారం రాత్రి చేపల వేటకు వెళ్లి ఎంఎం రకం వల వదిలాను. తరువాత సోనాబోటు నా వలను ధ్వంసం చేయడంతో సుమారు 30 వేల రూపాయల వల సముద్రంలో కొట్టుకుపోయింది. మిగిలిన వలను తీరానికి తీసుకొచ్చి బాగు చేసుకుంటున్నా.
– తంబు స్వాములు, ఊళ్లపాలెం
మిగిలిన వలను
బాగుచేసుకుంటున్నా
సోనాబోట్ల విధ్వంసం
సోనాబోట్ల విధ్వంసం
సోనాబోట్ల విధ్వంసం


