
వైపాలెంలో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్
యర్రగొండపాలెం: నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గ ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం(ఎస్సీ) ఆవిర్భవించింది. మహానేత వైఎస్సార్ పిలుపు మేరకు రైల్వే శాఖలో ఉన్నత ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. సురేష్ రాజకీయలకు కొత్త అయినప్పటికీ వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో నియోజకవర్గ ప్రజలు ఆదరించి 13,194 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. వైఎస్సార్ మరణానంతరం, ఆనాటి రాజకీయ పరిస్థితుల వల్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం తరువాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాలపర్తి డేవిడ్‌రాజును ప్రజలు ఆదరించడంతోపాటు 19,071 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అయితే డేవిడ్ రాజు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఆనాడు సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కార్యకర్తలకు ఆండగా నిలిచారు. 2019లో ఆయనకే వైఎస్సార్ సీపీ టికెట్ దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు 31,632 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదిమూలపు సురేష్‌కు రెండు పర్యాయాలు కీలక మంత్రి పదవులు ఇచ్చి నియోజకవర్గ ప్రజలను గౌరవించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేయించి జాతికి అంకితం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు నిధులను కేటాయించారు. పుల్లలచెరువు మండల ప్రజలకు తాగు, సాగు నీటి వసతి కల్పించేందుకు తీగలేరు–5 కాలువకు రూ.32 కోట్ల నిధులకు అడ్మినిస్ట్రేషన్ అనుమతులిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు, హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలతో ప్రతి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసి ఆ పల్లె ముంగిటకు పాలనను తీసుకెళ్లారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల వైద్యశాలను నిర్మించారు. నవరత్నాల పథకాలు అమలుచేసి కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా దాదాపు 1.80 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు. అనేక అభివృద్ధి పనులతో నియోజకవర్గం ముందుకు సాగుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్‌ను పోటీలో దించారు. గత నెల 13న జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టగా 5,477 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. దీంతో నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ సాధించినట్టయింది.