అభివృద్ధిని విస్మరించిన సీఎం కేసీఆర్: షర్మిల

పెన్‌పహాడ్: సీఎం కేసీఆర్‌కు ఓటు వేస్తే అభివృద్ధి చేయడం మరిచి ధరలు పెంచారని, ప్రజలను ఆదుకోరు కానీ పన్నులు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం క్రాస్‌రోడ్, పెన్‌పహాడ్, మాచారం, దూపహాడ్, లింగాల క్రాస్‌రోడ్ మీదుగా ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఎండనక, వాననక పాదయాత్ర చేస్తున్నది వైఎస్సార్ పాలన కోసమే. కేవలం వైఎస్సార్‌ను ప్రేమించిన ప్రజలు ఆగం అవుతున్నారని పార్టీ పెట్టా. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అమలు చేస్తా’అని హామీ ఇచ్చారు. దూపహాడ్ గ్రామంలో షర్మిల పాదయాత్రకు మద్దతు తెలుపుతూ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్ గొంగడి, గొర్రెపిల్లను బహూకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి వేణు, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు నీలం రమేశ్ పాల్గొన్నారు.