టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చాకే సమస్యల పరిష్కారం | Pawan Kalyan Comments In Janavani Program | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చాకే సమస్యల పరిష్కారం

Oct 4 2023 5:44 AM | Updated on Oct 4 2023 5:44 AM

Pawan Kalyan Comments In Janavani Program - Sakshi

మీటర్‌ రీడర్ల సమస్యలపై మాట్లాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌

మచిలీపట్నం టౌన్‌/చిలకలపూడి (మచిలీపట్నం): టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. పవన్‌ మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు, సంఘాల నాయకుల నుంచి అర్జీలు స్వీకరించారు. అయితే, సమస్యలకు పవన్‌ పరిష్కారం చూపిస్తారనో, పోరాటం చేస్తారనో ఆశించిన అర్జీదారులకు నిరాశే ఎదురైంది.

టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని పవన్‌ ప్రతి అర్జీదారుడికి చెప్పడంతో వారంతా కంగుతిన్నారు. అటువంటప్పుడు ఇప్పుడే జనవాణి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించారని పలువురు అక్కడే చర్చించుకున్నారు. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పేరును పవన్‌ జనవాణిలో ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉన్నట్లుగా ఆయన వ్యవహరించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, నేడు వాటిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు.

మీటర్‌ రీడర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని, ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లు పెట్టి తమను తొలగించాలని చూస్తోందని పవన్‌కు విన్నవించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. టెక్నాలజీని అప్‌డేట్‌ చేయటం అవసరమేనని, అయితే కార్మికులను పరిగణనలోకి తీసుకుని విడతలవారీగా అమలు చేస్తూ వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అధికారంలోకి రాగానే టీడీపీతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు.

స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఆంధ్రజాతీయ, హిందూ కళాశాలలకు ఎయిడెడ్‌ గుర్తింపు రద్దు చేసి భూములు లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు పవన్‌కు వినతిపత్రం అందజేశారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని, వీటిని అసెంబ్లీలోకి అడుగుపెట్టి అడుగుతాం లేదా తమ ప్రభుత్వం వస్తే పరిష్కరిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. పలువురు వ్యక్తిగత సమస్యలను విన్నవించారు. 

ప్రతి అర్జీకి మనోహర్‌తో మాట్లాడాకే స్పందన
పవన్‌ తన వద్దకు వచ్చిన ప్రతి అర్జీపైనా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్‌తో మాట్లాడిన తర్వాతే స్పందించారు. ఆ సమస్యపై మైక్‌లో మాట్లాడుతూ.. మధ్యలో కూడా మనోహర్‌తో, వరప్రసాద్‌తో చర్చించటం కనిపించింది. సమస్యలపై అవగాహన లేకపోవటం వల్లే ప్రతి అంశం పైనా వారితో పవన్‌ చర్చిస్తున్నారని జనసేన నేతలే చెబుతున్నారు.

పెడనలో అల్లర్లకు వైఎస్సార్‌సీపీ ప్రణాళిక: పవన్‌ 
జనసేన వారాహి యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని  పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలు అల్లరిమూకలను రప్పించి రాళ్లతో దాడి చేయించాలని ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోందన్నారు.

ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే జనసైనికులు సంయమనం పాటించి వారిని పోలీసులకు అప్పగించాలని అన్నారు. అనుమా­నాస్పదంగా కనిపించినా, మారణాయుధాలు తీసుకువచ్చినా వారిని చుట్టుముట్టి బంధించాలన్నారు. ఎటువంటి అల్లర్లు, గొడవలు జరిగినా రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement