కర్ణాటకలో మూడు ముక్కలాట! 

 Legislative Assembly elections are scheduled to be held in Karnataka on 10 - Sakshi

బొమ్మై ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని మోదీ ఇమేజ్‌ మరిపించగలదా? 

బలమైన స్థానిక నాయకత్వం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుందా? 

కింగ్‌ మేకర్‌ నుంచి కింగ్‌ అవాలన్న జేడీ(ఎస్‌) ఆశలు ఫలిస్తాయా?  

అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి 40 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని తహతహలాడుతూ బీజేపీ.. 
కన్నడ నాట పార్టీ జెండా ఎగురవేసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పొందాలని కాంగ్రెస్‌..
కన్నడ ఆత్మగౌరవ నినాదాన్ని మరింత రాజేసి  కింగ్‌మేకర్‌ స్థాయి నుంచి కింగ్‌గా మారాలని జేడీ(ఎస్‌).. 
పార్టీ ల వ్యూహ ప్రతివ్యూహాలతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి

సాక్షి, నేషనల్‌ డెస్క్‌ : కర్ణాటక ఓటర్లు ప్రతీసారి ఒకే తీర్పు ఇవ్వడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 1985 నుంచి ఏ పార్టీ కూడా వరసగా రెండోసారి గెలవలేదు. ఈసారీ అదే సంప్రదాయం కొనసాగుతుందా, అధికార బీజేపీకి మళ్లీ పట్టం కడతారా అన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వంపై అధికార వ్యతిరేకతను ప్రధాని మోదీ ఇమేజీతో ఎదుర్కొనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది.

మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 150 సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకుంది. బలహీనంగా ఉన్న పాత మైసూరు (ఉత్తర కర్ణాటక)లో బలపడటంపై దృష్టి పెట్టింది. 89 స్థానాలున్నా ప్రాంతంలో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తరచూ పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అంతగా బలంగా లేకపోవడం, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదాన్నే వారు నమ్ముకున్నారు. 100 సీట్లలో కీలకమైన లింగాయత్‌ ఓటు బ్యాంకును నమ్ముకుంది.  

బీజేపీ ఇలా కేంద్ర నాయకత్వాన్ని నమ్ముకుంటే, కాంగ్రెస్‌కు స్థానిక నాయకత్వమే బలంగా ఉంది. పీసీసీ చీఫ్‌ డి.కె శివకుమార్, సీనియర్‌ నేత సిద్ధరామయ్య కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్ల రద్దు, ధరల పెరుగుదల, హిజాబ్‌ వంటివాటిపై పార్టీ దృష్టి పెట్టింది. ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకుంటోంది. జేడీ(ఎస్‌) కన్నడ ఆత్మగౌరవ నినాదంతో ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. మాజీ సీఎం హెచ్‌.డి.కుమారస్వామి అంతా తానై నడుపుతున్నారు. ముక్కోణ పోరులో విజయం ఎవరిదోనన్న ఉత్కంఠ నెలకొంది....

బీజేపీ.. 
అనుకూలం..  
ప్రధాని మోదీ ఇమేజ్‌. కేంద్ర నేతలు చేస్తున్న పర్యటనలు. డబుల్‌ ఇంజిన్‌ నినాదం. 
 సంఘ పరివార్‌ సంస్థాగత బలం. 
లింగాయత్‌ సామాజిక వర్గం మద్దతు, వక్కలిగ అనుకూల వైఖరితో మైసూర్‌ ప్రాంతంలో పెరుగుతున్న పట్టు. 
♦ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు. 
♦ డిజిటల్‌ మీడియా ప్రచారంలో పార్టీ కున్న పట్టు.

వ్యతిరేకం..
 ప్రభుత్వ వ్యతిరేకత, బొమ్మై 
♦ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు. 
♦   40% కమీషన్ల ప్రభుత్వమన్న విపక్షాల ఉధృత ప్రచారం. 
♦ ఎన్నికలకు ముందు మైనార్టీ ల  ఓబీసీ కోటా రద్దుతో ముస్లింలు పార్టీకి మరింత దూరం. 
♦ టికెట్‌ దక్కే అవకాశం లేని ఆశావహుల అసమ్మతి.

జేడీ(ఎస్‌)
అనుకూలం.. 
♦  వక్కలిగ సామాజిక వర్గం మద్దతు. 
♦   కన్నడ ఆత్మగౌరవం నినాదం మిన్నంటుతున్న వేళ ప్రాంతీయ పార్టీ గా ఉన్న ఇమేజ్‌. 
♦   రైతు అనుకూల విధానాలతో  గ్రామీణ ప్రాంతాల్లో పట్టు. 
♦   హంగ్‌ వస్తే బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరికైనా మద్దతివ్వగల వైఖరి. 

వ్యతిరేకం..
♦ కుటుంబ పార్టీ ముద్ర. 
♦  వక్కలిగ మినహా మిగతా సామాజిక  వర్గాల ఆధిపత్యమున్న ప్రాంతాల్లో ఎదగకపోవడం. 
♦  సొంత బలంపై పార్టీ అధికారంలోకి వచ్చే సత్తా లేకపోవడం.. చాలాచోట్ల గెలుపు గుర్రాలు లేకపోవడం. 
♦   2018 నుంచి పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు. 

కాంగ్రెస్‌
అనుకూలం  
♦   బలమైన స్థానిక నాయకత్వం. 
♦   బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న అహిండా (మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల) సోషల్‌ ఇంజనీరింగ్‌ విధానంతో. తద్వారా వర్గాల ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం. 
♦   బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలపై పేసీఎం, 40% కమీషన్‌ అంటూ చేస్తున్న ప్రచారం. 
♦   కర్నాటకకు చెందిన దళిత నేత మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడయ్యాక వస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశం. 
♦   గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్రాడ్యుయేట్లకు రూ.3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,000 ఆర్థిక సాయం వంటి హామీలు. 

వ్యతిరేకం  
♦  శివకుమార్, సిద్దరామయ్య వర్గాల మధ్య పోరు. 
♦   జి.పరమేశ్వర, హెచ్‌.కె.పాటిల్, కె.హెచ్‌.మునియప్ప వంటి నేతల్ని పక్కన పెట్టడంతో అసమ్మతి. కీలకమైన లింగాయత్‌ సామాజిక వర్గంలో ఓటు బ్యాంకును పెంచుకోలేకపోవడం.
♦   ప్రధాని మోదీ ఇమేజ్‌కి దీటైన కేంద్ర నాయకత్వం లేకపోవడం. 
♦   ఆశావహులు ఎక్కువవటంతో అసమ్మతి భగ్గుమనే ఆస్కారం.

కాంగ్రెస్‌దే అధికారం..! 
కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే విడుదలైన ఏబీపీ–సీఓటర్‌  ఎన్నికల సర్వే కాంగ్రెస్‌ పార్టీ యే అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు వస్తాయని, బీజేపీ 68–80 సీట్లు గెలుచుకుంటే జేడీ (ఎస్‌) 23–25 సీట్లతో సరిపెట్టుకుంటుందని సీ ఓటర్‌ సర్వేలో తేలింది. బసవరాజ్‌ బొమ్మై పరిపాలన అసలు బాగోలేదని సర్వేలో పాల్గొన్న ఏకంగా 50.5%మంది తేల్చి చెప్పారు. 57శాతం మంది ప్రస్తుత ప్రభుత్వం మారిపోవాలని అభిప్రాయపడినట్టు ఆ సర్వే వెల్లడించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top