Communist Parties CPI CPM Working Together, A Good Sign - Sakshi
Sakshi News home page

ఆ తప్పులే కొంప ముంచాయా?.. ఎందుకిలా జరిగింది?

Published Sat, Apr 15 2023 9:00 AM

Communist Parties CPI CPM Working Together A Good Sign - Sakshi

కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి దిక్సూచి అని ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు అభిప్రాయపడడం ఆసక్తికర పరిణామమే. కాకపోతే తాను ఎక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు అన్నట్లుగా కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు చారిత్రక తప్పిదాలు చేస్తూ పోతున్నారు. తత్ఫలితంగా వారు దేశంలో నానాటికి కునారిల్లిపోతున్నారు. నిజమే! ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే పేద ప్రజల పక్షాన ఉంటారని అంతా అనుకునేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన విపక్షం ఉండాలని, అందులోను కమ్యూనిస్టులు వంటివారు ఉంటే దేశానికి ప్రయోజనకరమని గతంలో భావించేవారు. కానీ ప్రజల నమ్మకాన్ని వారే వమ్ము చేసుకున్నారు. రైట్ టైమ్ -రాంగ్ డెసిషన్, రాంగ్ టైమ్- రైట్ డెసిషన్ అన్న నానుడి వీరికి బాగా వర్తిస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు. 

స్వాతంత్ర పోరాట సమయంలో కొన్నిసార్లు కమ్యూనిస్టులు అనుసరించిన వైఖరులు విమర్శకు గురి అయ్యాయి. అయినా వారి దేశ భక్తిని ఎవరూ శంకించేవారు కారు.. ఆ తర్వాత నిజాం సంస్థానంపై జరిగిన పోరు, సాయుధ రైతాంగ పోరాటాలలో కమ్యూనిస్టులు ఎదుర్కున్న కష్టాలు ఇన్నీ,అన్నీ కావు.  సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా నిజాం సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయగలిగారు.

ఆ తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం సాగించడం ద్వారా తీవ్రంగా నష్టపోయిందని చెబుతారు. చాలా మంది యోధులను కోల్పోవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. తదుపరి ఎన్నికల రాజకీయాలలోకి రాక తప్పలేదు. కానీ అనతికాలంలోనే రష్యా లైన్, చైనా లైన్ గా పార్టీ నేతలు విడిపోయి, అనంతరం రెండు ప్రధాన పార్టీలుగా కమ్యూనిస్టులు ఏర్పడ్డారు. సీపీఐ నుంచి వేరుపడ్డ సీపీఎం క్రమేపీ పుంజుకుని పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలలో అధికారం సాధించింది. 

అయినా కమ్యూనిస్టుల చీలికలు ఆగలేదు నక్సలైట్ ఉద్యమం దేశంలోనే పెద్ద సంచలనం. భయానకం, ప్రభుత్వ అణచివేతను తట్టుకోవడం అంత తేలిక కాదని రుజువైనా ఇప్పటికీ పీపుల్ వార్ గ్రూప్ పేరుతోనో, మరో పేరుతోనో అడవులలో పోరాటాలు చేస్తున్నవారు ఉన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాలలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎంల మధ్య ఏదో రూపంలో గొడవలు సాగుతుండేవి. కొన్ని చోట్ల ఇరువైపులా హత్యలు చేసుకునేంతగా కక్షలు పెరిగాయి.

ఉదాహరణకు గతంలో ఖమ్మం జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన కలహాలకు పలువురు బలి అయ్యారు. దేశవ్యాప్తంగా ఈ రెండు పార్టీలు క్యాడర్ ను కలిగి ఉన్నా సీపీఎందే పై చేయి అవుతూ వచ్చింది. కానీ ఆ పార్టీ కూడా ఇటీవలికాలంలో దారుణంగా దెబ్బతింది. ముప్పైమూడేళ్లపాటు నిరాటంకంగా పశ్చిమబెంగాల్లో పాలన చేసిన సీపీఎంకు ప్రస్తుతం ఆ రాష్ట్ర శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం చారిత్రక విషాదం అని చెప్పాలి. 

సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే ఆ పార్టీని ఇలా పతనం చేశాయని అంటారు. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు దేశ ప్రధాని అయ్యే అవకాశం వస్తే, దానిని ఆ పార్టీ వదలుకోవడం కూడా పెద్ద తప్పిదంగా చాలా మంది పరిగణిస్తారు. 1991 కి ముందు కాంగ్రెస్‌పై గుడ్డి వ్యతిరేకతతో ఉన్న సీపీఎం 2004 నాటికి ఆ పార్టీతో కలవక తప్పలేదు.

1971లో ఇందిరాగాంధీతో రాజకీయ సంబంధాలు నెరపిన సీపీఐ ఆ తర్వాత కాలంలో దూరం అయింది. 1989 లో బీజేపీతో కలిసి  వీపీ సింగ్ ప్రభుత్వానికి వామపక్షాలు  మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాయి. మూడో ఫ్రంట్ అనో, మరొకటనో రకరకాల ప్రయోగాలు చేసిన వామపక్షాలు 2004 నాటికి కాంగ్రెస్ తో జతకట్టక తప్పలేదు. దానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయకుండా నూక్లియర్ ఒప్పందం పేరుతో 2009 నాటికి కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. దాంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. 

ఆ తర్వాత క్రమేపి క్షీణించడమే తప్ప ఎదుగుదల లేకుండా పోయింది. తాజాగా సీపీఐ జాతీయ హోదాను కూడా కోల్పోయింది. సీపీఎం కేరళలో మాత్రం అధికారం సాధించగలిగింది. అందులో సీపీఐ కూడా ఒక భాగస్వామిగా ఉంది. 1996లో మాత్రం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఇద్దరు సీపీఐ నేతలు కేంద్రంలో మంత్రులుగా ఉండేవారు ప్రముఖ నేత ఇంద్రజిత్ గుప్తా వారిలో ఒకరు. కానీ ఆ పరిణామాలను పార్టీకి పెద్దగా  ఉపయోగించుకోలేకపోయారని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా రెండు పార్టీలు రెండు లైన్ లు తీసుకున్నాయి.

సీపీఐ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉద్యమం చేస్తే, సీపీఎం సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంది. ఈ రెండు విధానాలలోను ఈ పార్టీలకు కలిసి వచ్చిందేమీ  లేదనే చెప్పాలి. చివరికి ఆంధ్ర, తెలంగాణలలో శాసనసభలలో పార్టీలకు ప్రాతినిద్యం లేకుండా పోయింది.  కొంతకాలం టీఆర్ఎస్ (ప్రస్తుతం బిఆర్ఎస్) కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లను బుజ్జగించడం వల్లో, , లేక బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నారనే కారణంతోనో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదన్న బాధలో ఉన్నట్లుగా సీపీఐ,సీపీఎం నేతల ప్రసంగాలను బట్టి అర్ధం అవుతుంది. బీఆర్ఎస్ తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందా అన్న ఆశతో ఎదురు చూడవలసిన పరిస్థితిలో పార్టీలు పడ్డాయి. 

ఇక ఏపీలో అయితే మరీ చిత్రమైన పరిస్థితి. బీజేపీ మద్దతు కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తంటాలు పడుతుంటే, సీపీఐ మాత్రం తెలుగుదేశంతో కలవడానికి వెంపర్లాడుతోంది. బీజేపీతో కలవం అంటూనే ఆ పార్టీ నేతలతో కలిసి రాజధాని ఉద్యమంలో చేతులెత్తుతుంటారు. పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసే వామపక్షాలు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే, దానిని స్వాగతించకపోగా ఆయన ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నామని చెబుతుంటారు.

ఈ విషయంలో సీపీఎం కొంత బెటర్ . సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పు చేతలలో ఉంటారన్న విమర్శలు ఎదుర్కుంటుంటారు. రాజధానిలో పేదలకు స్థలాలు ఇవ్వద్దన్న వారితో కలిసి ఈ పార్టీ పనిచేస్తుంటుంది. పేదలకోసం పలు స్కీములు అమలు చేస్తున్న జగన్ ను వ్యతిరేకించడం చారిత్రక తప్పిదమే అవుతుందేమో!

జగన్ పేదల కోసం అమలు చేస్తున్న స్కీములను సీపీఎం అగ్రనేత , దివంగత పుచ్చలపల్లి సుందరయ్య జీవించి ఉంటే స్వాగతించి ఉండేవారని సీనియర్ నేత పాటూరి రామయ్య వ్యాఖ్యానిస్తే, సీపీఎం నాయకత్వం ఆయనను తప్పు పట్టడం చిత్రమే.  వామపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవడంలో అంత సఫలం కాలేకపోతున్నాయని, హైదరాబాద్ లో జరిగిన సభలో  ఉభయ పార్టీల అగ్రనేతల ఉపన్యాసాలను విశ్లేషించుకుంటే అర్ధం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌పై గుడ్డి వ్యతిరేకత, ఇప్పుడు బీజేపీపై గుడ్డి వ్యతిరేకత పెంచుకుంటున్నారు. గతంలో టాటా, బిర్లా తదితర పారిశ్రామిక సంస్థలను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ప్రస్తుతం రిలయన్స్ అంబానీ, అదాని వంటివారిని వ్యతిరేకిస్తున్నారు. 

కానీ చైనా వంటి కమ్యూనిస్టు దేశంలో కూడా కార్పొరేట్ సంస్థలను ఎలా ప్రోత్సహిస్తున్నది తెలుసుకుంటే మన కమ్యూనిస్టులు ఎటు వైపు పయనిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏ పారిశ్రామకి సంస్థలో అయినా తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపడం తప్పు కాదు. కానీ ఆ సాకుతో అసలు పెద్ద పరిశ్రమలను వ్యతిరేకిస్తున్న తీరు వారికి ప్రయోజనం కలిగించదు. ఒకప్పుడు కంప్యూటర్ లను వీరు వ్యతిరేకించేవారు .కానీ సాంకేతిక పరిజ్ఞానం అపారంగా పెరిగిన తరుణంలో వాటిని అనుసరించక తప్పలేదు. ఇక మీడియా బారన్ రామోజీరావుకు చెందిన మార్గదర్శి గ్రూపులో జరిగిన అవకతవకలపై సీపీఐ  కూడా అచ్చం తెలుగుదేశం మాదిరే మాట్లాడింది తప్ప, హేతుబద్దంగా స్పందించలేదు.  ఒకప్పుడు సీపీఐ ,సీపీఎం లు కలిసి పనిచేసి ఉంటే మంచి ప్రత్యామ్నాయంగా ఎదిగి ఉండేవారు. 

1952లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. ఆనాడు జరిగిన ఎన్నికలలో ఈ ప్రాంతం వరకు చూసుకుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు దాదాపు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. తదుపరి 1955 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రకాశం పంతులు, ఎన్.జి.రంగా వంటివారిని కలుపుకుని కమ్యూనిస్టులను పూర్తిగా దెబ్బతీసింది. అప్పట్లో అధిక విశ్వాసంతో కమ్యూనిస్టు పార్టీ దెబ్బ తింది.

తదుపరి ఎప్పటికీ కోలుకోలేకపోయింది. కమ్యూనిస్టు పార్టీ  స్పేస్‌ను పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆక్రమించేశాయి. దాంతో ఆ పార్టీలపై ఆధారపడవలసిన దయనీయ స్థితి వామపక్షాలకు సంక్రమించింది. 1952 నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు కేంద్రంలోను, ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ తో పోటాపోటీగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వామపక్షం ఇప్పుడు ఉనికిని నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా ఉంది. ఈ సంక్షోభం నుంచి వామపక్షాలు బయటపడగలతాయా అంటే సంశయంగానే ఉంది. వామపక్షాలు ఐక్యత కోసం ప్రయత్నించడం మంచి పరిణామమే. కాకపోతే ఇప్పటికే బాగా ఆలస్యం అయిందనే సంగతి ఆ పార్టీల నేతలకే బాగా తెలుసు అని చెప్పవచ్చు. 


- కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
చదవండి: ఏది నిజం?: బాబే.. ప్రైవేటు మాస్టర్‌.. అంతా చేసింది ఆయనే.. ఒక్క ముక్క రాయని ఈనాడు

Advertisement
Advertisement